మోడీ గుహకు మస్తు గిరాకీ

మోడీ ధ్యానం చేసిన గుహకు భక్తులు క్యూ కడుతున్నారు. హిమాలయాల్లో గజగజ వణికించే పర్వతాల మధ్యలో, కేదారనాథ్​ ఆలయానికి సమీపంలో ఈ గుహ ఉంది. మోడీ ధ్యానించిన తర్వాత అక్కడ ధ్యానం చేయడానికి ఇప్పటివరకు 78 మంది ఆసక్తి కనబరిచారు. అత్యాధునిక సదుపాయాలతో ఈ గుహను రూపొందించారు. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడానికి ఇదొక చక్కటి అవకాశంగా పబ్లిసిటీ పెరిగింది.  నరేంద్ర మోడీ ఇప్పుడొక ఐకాన్​. చాయ్​వాలాగా తనను తాను పరిచయం చేసుకొని,  చిన్న వ్యాపారులకు జోష్​నిచ్చారు. ఖరీదైన సూటు వేసుకుని ఫ్యాషన్​ మోడల్​గా నిలిచారు. ఫిట్​నెస్​కోసం యోగాసనాలు వేసి, హెల్త్​ ఇండియాని ప్రమోట్​ చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… రుద్ర ప్రయోగ్​ జిల్లా (ఉత్తరాఖండ్​)లోని కేదార్​నాథ్ గుహ​లో ధ్యానం చేయడం ఒక ఎత్తు.  దీనితో ఆయన ‘మెడిటేషన్​ గురు’గా గుర్తింపు పొందారు. ఆ గుహకి ఎక్కడలేని పబ్లిసిటీ కల్పించారు. అల్ట్రా మోడరన్​ సదుపాయాలతో తయారుచేసిన ఒక మ్యాన్​ మేడ్​ గుహలో మోడీ ఒక రాత్రంతా ధ్యానంలో గడిపిన సంగతి గుర్తుండే ఉంటుంది.

మోడీ ధ్యానం చేసిన గుహలోనే ధ్యానం చేయాలన్న కోరికతో చాలామంది అడ్వాన్స్​ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈ గుహలో ధ్యానానికి ఇప్పటివరకు 78 మంది బుక్​ చేసుకున్నారు. మే నెలలో నలుగురు, జూన్​లో 28 మంది, జూలైలో 10 మంది, ఆగస్టులో 8 మంది ధ్యానం చేశారు. ఈ నెలలో 19మంది, అక్టోబరులో 10 మంది గుహలో ధ్యానానికి బుక్​ చేసుకుని వెయిటింగ్​ లిస్టులో ఉన్నారు. ఫోన్​, స్నానాల గది, పరుపు, దిండ్లు, కరెంట్​ వగైరా అన్ని హంగులూ ఉన్న ఈ గుహలో రాత్రంతా ధ్యానం చేయాలంటే రూ.1,500, ఉదయం నుంచి రాత్రి వరకు ధ్యానించాలంటే రూ.999 చార్జి చేస్తారు.

అసలీ గుహ ఏమిటి? ఎక్కడుంది? దీనికింత పబ్లిసిటీ ఎందుకొచ్చింది? తెలుసుకోవాలంటే… మూడున్నర నెలల వెనక్కి వెళ్లాలి. లోక్​సభ ఎన్నికల చివరి విడత పోలింగ్​ మే నెల 19న జరిగింది. లాస్ట్​ ఫేజ్​కి ప్రచారం ముగిశాక, మే 18వ తేదీ శనివారం ఉదయాన, కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో ప్రధాని మోడీ ‘కేదార్​నాథ్​, బదరీనాథ్​​ యాత్ర’కు వెళ్లారు. శనివారం కేదారనాథుడిని దర్శించుకున్నాక, అక్కడికి దగ్గరలో ఉన్న ‘రుద్ర మెడిటేషన్​ కేవ్​’కి కాలినడకన ఒంటరిగా బయలుదేరారు. ఆ గుహలో శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు దాదాపు 17 గంటలపాటు ధ్యానంలో గడిపారు.

నరేంద్ర మోడీ ఒక సన్యాసి మాదిరిగా చేతిలో కర్రతో, కాషాయ రంగు కండువాతో ఒంటరిగా గుహకు నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు, గుహలో ధ్యానముద్రలో మునిగిన ఫొటోలు సోషల్​ మీడియాలో బాగా ప్రచారమయ్యాయి. సముద్ర మట్టానికి 11,700 అడుగుల ఎత్తున హిమాలయాల్లోగల ఈ గుహను ‘రుద్ర మెడిటేషన్​ కేవ్​’గా వ్యవహరిస్తారు.   గఢ్వాల్​ మండల్​ వికాస్​ నిగమ్ (జీఎంవీఎన్​)​ దీనిని మెయింటైన్​ చేస్తోంది. కేదార్​నాథ్​ గుడి మార్గం ఏడాదికి ఆరు నెలలపాటే తెరచి ఉంటుంది. అక్షయ తృతీయ మొదలుకొని దీపావళి ముందు రోజైన ధన త్రయోదశి వరకు ఈ గుడికి భక్తులను అనుమతిస్తారు. సెప్టెంబర్​, అక్టోబరు రెండు నెలల్లోనూ మంచు కురిసే అవకాశమున్నందువల్ల వాతావరణాన్ని బట్టి కేదార్​నాథ్​ వెళ్లడానికి వీలవుతుంది. ఈ ఏడాది మే 7న తెరచిన గుడిని అక్టోబర్​ 29న మూసేస్తారు.

​మోడీ ధ్యానం చేయడంతో రుద్ర మెడిటేషన్​ కేవ్​కి జనంలో ఆసక్తి పెరిగిందన్నారు కేంద్ర టూరిజం సహాయ మంత్రి ప్రహ్లాద్​ పటేల్​.  ‘ఈ ఏడాది ఇప్పటివరకు 78 మంది అడ్వాన్స్​ బుకింగ్​ చేసుకున్నారు. అక్టోబరులో కేదార్​నాథ్​ గుడిని మూసేశాక, వచ్చే ఏడాదికోసం గుహలో ధ్యానానికి బుకింగ్స్​ ఓపెన్​ చేస్తాం’ అని చెప్పారు. ప్రధాని మోడీ ఎప్పుడు విదేశాలకు వెళ్లినా ఇండియాలో టూరిజం ప్రమోషన్​కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. స్వయంగా ఆయనే ధ్యానం చేయడంతో కేదార్​నాథ్​లోని గుహకు మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్లయ్యింది.

Latest Updates