ఈశాన్యంలో హింస వెనుక కాంగ్రెస్ కుట్ర: మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణ

    ‘సిటిజన్’ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అగ్గి రాజేస్తున్నయి

     దేశ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నయి: ప్రధాని మోడీ

సిటిజన్​షిప్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దేశంలో ఉద్రిక్తతలు పెంచుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పలు రాష్ర్టాల్లో కొనసాగుతున్న ఆందోళనల వెనుక ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని, హింసను ప్రేరేపిస్తున్నాయని మండిపడ్డారు. దేశం ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నాయని విమర్శించారు. కానీ ఈశాన్య రాష్ర్టాల ప్రజలు హింసను వ్యతిరేకించారని అన్నారు. ఆదివారం జార్ఖండ్​లో జరిగిన ఎన్నికల సభలో ప్రతిపక్ష కూటమిని టార్గెట్ చేసుకుని మోడీ మాట్లాడారు. జార్ఖండ్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్, జార్ఖండ్ ముక్తి మోర్చా​కు ఓ రోడ్ మ్యాప్, ఎజెండా అంటూ ఏదీ లేదని ఎగతాళి చేశారు.

పాక్ చేసిన పనే కాంగ్రెస్ చేస్తోంది..

విదేశాల్లో కాంగ్రెస్ చేస్తున్న ఆందోళనలు మోడీ ఖండించారు. పాకిస్తాన్ చాలా కాలంగా చేస్తున్న పనిని కాంగ్రెస్ చేసింది అని దుయ్యబట్టారు. లండన్​లోని ఇండియన్ హై కమిషన్ ఎదుట జరిగిన నిరసనలు ఉద్దేశిస్తూ మోడీ ఈ కామెంట్ చేశారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ జన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పాకిస్తాన్ ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేసింది” అని మండిపడ్డారు.

1000 శాతం సరైనదే

‘‘దేశం చూస్తోంది. పార్లమెంటులో పౌరసత్వం బిల్లు పాస్ అయిన తర్వాత ప్రజలు మోడీకి తమ మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షం చర్యలను చూస్తే.. పార్లమెంటు తీసుకున్న నిర్ణయం 1000 శాతం సరైనదే అని స్పష్టమవుతోంది” అని ప్రధాని అన్నారు. ‘‘ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెస్​లు కట్టుకున్నాయి. కానీ ప్రజల సమస్యలను పట్టించుకోలేదు” అని మండిపడ్డారు.

నేను మీ సేవకుడిని

కేంద్రం, జార్ఖండ్ రాష్ర్టంలో బీజేపీ ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి పనులను మోడీ వివరించారు. ‘‘నేను మీ సేవకుడిని. జార్ఖండ్​లో మా పార్టీ చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించడానికే నేను ఇక్కడికి వచ్చాను” అని ఆయన అన్నారు.

అస్సాం ప్రజలకు అభినందనలు

నార్త్ ఈస్ట్, వెస్ట్ బెంగాల్​లో జరుగుతున్న హింసాత్మక ఆందోళనలకు ప్రతిపక్షం నిశబ్దంగానే మద్దతిస్తోందని మోడీ ఆరోపించారు. ఓవైపు ఈశాన్య రాష్ర్టంలో ఆందోళనలు జరుగుతున్నా.. హింసకు దూరంగా ఉన్న అస్సాం ప్రజలను అభినందించారు. ‘‘హింసను వ్యాప్తి చేస్తున్న వారికి దూరంగా ఉన్న అస్సాంలోని నా సోదర సోదరీమణులను అభినందిస్తున్నా” అని అన్నారు.

సర్దార్‌‌‌‌ పటేల్‌‌కు మోడీ నివాళి

ఇండియా మొదటి డిప్యూటీ ప్రైమ్‌‌మినిస్టర్‌‌‌‌ సర్దార్‌‌‌‌ వల్లభాయ్‌‌ పటేల్‌‌కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించారు. ఆదివారం పటేల్‌‌ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకున్నారు. “ ఇండియాకు సర్దార్‌‌‌‌ పటేల్‌‌ చేసిన సేవ నిత్యం స్ఫూర్తిని ఇస్తుంది. ఆయన పుణ్య తిథినాడు నివాళులర్పిస్తున్నాను” అని మోడీ ట్వీట్‌‌ చేశారు.
మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Latest Updates