టీఆర్ఎస్ పై మోడీ గుస్సా

రాష్ట్రంలో అధికార టీఆర్‌‌ఎస్‌‌, బీజేపీకి మధ్య అంతరంపెరుగుతోంది. వారణాసిలో తనపై నిజామాబాద్‌ రైతులు పోటీకి దిగడం వెనుక టీఆర్‌‌ఎస్‌‌ ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని మోడీ గుస్సా అయినట్లు తెలుస్తోంది. స్వయంగా టీఆర్‌‌ఎస్‌‌ నేతలే నామినేషన్లను ప్రోత్సహించారంటూ రాష్ట్ర బీజేపీ కూడా నివేదిక పంపడంతో ఈ విషయాన్ని ఆయన సీరియస్‌‌గా తీసుకున్నారు. అందుకే ‘ఇక కఠినంగా ఉండండి ’ అని రాష్ట్ర బీజేపీని పార్టీ హైకమాండ్‌ ఆదేశించినట్లు సమాచారం. ఏ విషయంలో కూడా మెతక వైఖరి అవసరం లేదని, గట్టిగా ఫైట్‌ చేయాలని సూచించినట్లు తెలిసింది. హైకమాండ్‌ సూచనలతో రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా వెళ్తోంది. ఇంటర్‌‌ బోర్డు వ్యవహారంపై ఆందోళనలను తీవ్రతరం చేసింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ నిరాహార దీక్షకు దిగిన సందర్భంగా.. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు గట్టిగా పోరాటం చేయాలని అమిత్‌‌ షా చెప్పినట్లు వెల్లడించారు. ఆ వెంటనే బీజేపీ, అనుబంధ సంఘాలు వరుస ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఏబీవీపీ కార్యకర్తలు సోమవారం ప్రగతి భవన్‌ లోకి చొచ్చుకుపోయేందు కు ప్రయత్నించారు. పార్టీ కార్యాలయంలో నిరాహార దీక్షకు దిగిన లక్ష్మణ్‌ ను పోలీసులు అరెస్ట్‌‌ చేసి హాస్పిటల్‌‌కు తరలించారు. ట్రీట్‌ మెం ట్‌ కు నిరాకరిస్తూ ఆయన అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా బీజేపీ నిరసనలు కొనసాగాయి. ప్రగతి భవన్‌‌ ముట్టడికి బీజేవైఎం ప్రయత్నించింది. జిల్లాల వారీగా నిరసనలకు పిలుపునివ్వడమే కాకుం డా బీజేపీ ముఖ్య నేతలు ట్యాంక్‌‌బండ్‌‌ సమపంలోని అంబేద్కర్‌‌ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. బుధవారం కూడా నిరసనలు కొనసాగుతాయని పార్టీ నేతలు ప్రకటించారు. మే 2న రాష్ట్ర బంద్‌‌కు పిలుపునిచ్చారు . అఖిలపక్షంతో కలవకుండానే టీఆర్‌‌ఎస్‌‌తో నేరు గా తలపడేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి .

ఆ 8 కోట్లపై సహాయ నిరాకరణ….

నిజామాబాద్‌‌ లోక్‌‌సభ సీటుకు టీఆర్‌‌ఎస్‌‌ నుంచి సీఎం కేసీఆర్‌‌ కూతురు కవిత, బీజేపీ నుంచి డీఎస్‌‌ కొడుకు అరవింద్‌‌ బరిలోకి దిగారు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ వైఖరికి నిరసనగా 177 మంది పసుపు, ఎర్రజొన్న రైతులు కూడా పోటీలో నిలిచారు. దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక్కో బూత్‌‌కు 12 ఈవీఎంలను వినియోగించి పోలింగ్‌‌ నిర్వహంచారు. ఇది దేశంలో ఒక రికార్డు. పోలింగ్‌‌ తర్వా త ఓటింగ్‌‌ శాతం అనూహ్యం గా పెరగడంపై, ఈవీఎంలు బయట ఎక్కడపడితే కనిపించడంపైనా వివాదం రేగింది. ఈ మొత్తం వ్యవహారంపై అరవింద్‌‌ ఈసీకి ఫిర్యా దు చేశారు. మరోవైపు పోలింగ్‌‌కు ముందు బీజేపీకి చెందిన రూ.8 కోట్లను పోలీసులు పట్టుకున్నారు . ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకు సహకరించకపోగా ఇబ్బందులకు గురి చేసిందన్న భావనలో బీజేపీ ఉంది. దీన్ని కూడా హైకమాండ్‌‌ దృష్టికి తీసుకుపోయినట్లు తెలిసింది. వీటన్నింటికి తోడు ఇప్పుడు ప్రధానిపైనే నిజామాబాద్‌‌ రైతులతో నామినేషన్లు వేయించడంతో ఆ పార్టీ ఆగ్రహం తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. నామినేషన్‌‌ వేసిన రైతుల్లో ఇటీవలే బీజేపీ నుంచి టీఆర్‌‌ఎస్‌‌లో చేరిన ఓ నేత కూడా ఉండడంతో ఇవి ఉద్దేశపూర్వకంగా వేసినవేనని, వీటి వెనుక టీఆర్‌‌ఎస్‌‌ ఉందని కమలం పార్టీ నమ్ముతోంది.

ప్రత్యామ్నాయం వైపు టీఆర్‌‌ఎస్‌ చూపు…

ఎన్నికల ఫలితాల తర్వా త కేంద్రంలో బీజేపీకి మద్దతు విషయంలో టీఆర్‌‌ఎస్‌‌ ముఖ్య నేతల ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు ప్రధాని మోడీ పసిగట్టారని తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు విడతల పోలింగ్‌‌లో ఓటర్‌‌ తీర్పు సైలెంట్‌‌గా ఉందనీ, అది మోడీకి అంతగా అనుకూలంగా లేదని గ్రహించిన టీఆర్‌‌ఎస్‌‌ పెద్దలు ‘ప్రత్యామ్నాయం’పై దృష్టి సారించినట్లు సమాచారం. మరో మూడు విడతల పోలింగ్‌‌ ఇంకా మిగిలి ఉన్నందున పరిస్థి తులను బట్టి ప్రాంతీయ పార్టీల ఫెడరల్‌ ఫ్రంట్‌‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమా? లేకుంటే కాంగ్రెస్‌‌కు మద్దతు తెలపడమా అన్న సమాలోచనలు టీఆర్‌‌ఎస్‌‌ పెద్దలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్‌ ఫ్రంట్‌‌ బలమైన శక్తిగా అవతరిస్తే కాంగ్రెస్‌‌ కూడా మద్దతు పలకవచ్చనే వాదన చేస్తున్నట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యం లో బీజేపీ ఇక టీఆర్‌‌ఎస్‌‌ పట్ల కఠినంగా వ్యవహరించడమే సరైందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Latest Updates