పార్లమెంట్ కు ఎవరూ డుమ్మా కొట్టొద్దు : మోడీ

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరిగింది. పార్లమెంట్ లైబ్రరీ భవనంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి తప్పకుండా రావాలని ఒకరోజు ముందే బీజేపీ ఎంపీలకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీచేసింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీసుకురాబోయే కీలకమైన బిల్లులకు సంబంధించి ఈ సమావేశంలో ప్రధానమంత్రి మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇతర నాయకులు వివరించారు.

బీజేపీ ఎంపీలు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తుండాలని ప్రధాని మోడీ సూచించారు. బీజేపీ ఎంపీలుగా గెలిచినవారిలో ఎక్కువమంది కొత్తవాళ్లే ఉన్నారని…. ప్రజల అభిప్రాయాలకు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పార్లమెంట్ సమావేశాలు జరిగినన్ని రోజులు.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంపీలు హాజరుకావాల్సిందే అని.. ఎవ్వరుకూడా డుమ్మా కొట్టకూడదని సూచించారు. పార్లమెంట్ సమావేశాల గైర్హాజరును పార్టీ సీరియస్ గా తీసుకుంటుందని చెప్పారు.

కేంద్రం పథకాలు మారుమూల పల్లెలకు చేరేలా ఎంపీలే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి మీడియాకు వివరించారు.

 

Latest Updates