మోడీ నిజాయితీ కాగితంపైనే: మాయావతి

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ నిజాయితీ కేవలం కాగితాలపైనేనని బీఎస్పీ సుప్రీం మాయావతి ఆరోపించారు. బీజేపీ, మోడీల నిజస్వరూపం వేరే ఉందని, అసలు ఖాతాలను దాచేసి బీద అరుపులు అరుస్తున్నారని విమర్శించారు. పార్టీల వారీగా చూస్తే.. బీజేపీలోనే ధనవంతులు, అవినీతిపరులు ఎక్కువున్నారు. దమ్ముంటే తాను అవినీతిపరుడినంటూ నిరూపించాలని ప్రధాని మోడీ విసిరిన సవాల్​పై మాయావతి మండిపడ్డారు. మోడీ బీద అరుపులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనన్నారు. తాము మాత్రమే నిజాయితీపరులమని, మిగతావారంతా అవినీతిపరులేనని భావించడం బీజేపీ నేతలకున్న జబ్బని అన్నారు.

గుజరాత్​అల్లర్లు మోడీ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయాయని, ఆయనతో పాటు బీజేపీ కూడా ఆ భారం ఇంకా మోస్తోందన్నారు. మోడీ ప్రధానిగానే కాదు సీఎంగా కూడా పనికిరాడని అన్నారు. అప్పట్లో గుజరాత్​కే పరిమితమైన అరాచకం, ద్వేషం మోడీ ఐదేళ్ల పాలనతో దేశమంతా విస్తరించిందని చెప్పారు. ‘నాలుగుసార్లు సీఎం సీట్లో కూర్చున్నా.. నా హయాంలో చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. ప్రజా సంక్షేమం విషయంలోనైనా, దేశ ప్రయోజనాల విషయంలోనైనా నా సమర్థతపై ప్రజలకు ఎలాంటి సందేహంలేదు’ అని మాయావతి చెప్పారు.

నోట్ల రద్దు పెద్ద స్కాం..

జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటి అనాలోచిత నిర్ణయాలతో మోడీ సర్కారు ప్రజలను కష్టాల్లోకి నెట్టిందని మాయావతి ధ్వజమెత్తారు. నోట్ల రద్దు వెనక బయటపడని పెద్ద స్కాం ఉందని, దీనిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. తామే నిజాయితీ పరులమని చెప్పుకోవడానికి ప్రభుత్వ సంస్థలను కూడా వాడుకున్నారని విమర్శించారు.

Latest Updates