అమెరికా రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సర్వే
ఇది దేశానికే గర్వకారణం: జేపీ నడ్డా ట్వీట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రపంచ దేశాల అధినేతల్లో మోస్ట్ పాపులర్ అని అమెరికా రీసెర్చ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ సర్వే తేల్చింది. ఈ సర్వేలో 75% మంది మోడీ నాయకత్వాన్ని ఆమోదించగా.. 20% మంది ప్రజలు తిరస్కరించారు. దీంతో మోడీ అప్రూవల్ రేటింగ్ 55 శాతంగా రికార్డయింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం.. అందరికన్నా మన ప్రధానికే అప్రూవల్ రేటింగ్ ఎక్కువగా ఉంది. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అప్రూవల్ రేటింగ్ 24% గా నమోదైంది. ఇక బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను జనం భారీగా డిసప్రూవ్ చేశారు. దీంతో ఆయనకు నెగటివ్ రేటింగ్ వచ్చింది.
దేశానికి గర్వకారణం..
ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ లీడర్‌గా మన ప్రధాని మోడీ గుర్తింపు పొందడం దేశానికే గర్వకారణమని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు. ఇది ఆయన సమర్థ నాయకత్వానికి నిదర్శనమని అన్నారు. ప్రపంచ నేతల్లో అత్యధికంగా అప్రూవల్ రేట్ ఉన్నది మోడీకేనని తెలిపారు. ‘‘వివిధ సమస్యలను హ్యాండిల్ చేయడం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సమర్థంగా పని చేసినందుకు మోడీ మరోసారి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రభుత్వ అధినేతగా అవతరించారు” అని సర్వేను ప్రస్తావిస్తూ నడ్డా ట్వీట్ చేశారు. మోడీ పాపులారిటీ, క్రెడిబులిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. అమెరికా, జపాన్, బ్రెజిల్ సహా 13 దేశాల్లో మార్నింగ్ కన్సల్ట్ సర్వే చేసిందని, వీరిలో మోడీకే ఎక్కువ శాతం రేటింగ్ వచ్చిందని మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.