లోక్ సభ లాస్ట్ సెషన్: రాహుల్ పై మోడీ సెటైర్లు

న్యూఢిల్లీ: 16వ లోక్ సభ చివరి సెషన్స్ నేటితో ముగిశాయి. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో సభలో తమ మాటలు వినిపించే లాస్ట్ చాన్స్ ను పార్టీల నేతలకు తమ స్టైల్ లో వాడుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఓ వైపు తమ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరో వైపు మధ్య మధ్యలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. సభలో కొంత మంది కళాకారులున్నారని, వారి ద్వారా మంచి రిలాక్సేషన్ పొందొచ్చని పరోక్షంగా ఆంద్రప్రదేశ్ ఎంపీ శివ ప్రసాద్ పై వ్యాఖ్యలు చేశారు.

స్పీచ్ హైలైట్స్..

  • సభను సమర్థంగా నడిపినందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు, అనేక కీలక బిల్లులను పాస్ చేయడంలో సహకరించినందుకు సభ్యులకు మోడీ థ్యాక్స్ చెప్పారు.
  • మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.
  • తాను తొలిసారి లోక్ సభకు వచ్చిన సభ్యుడినని, ఈ సభలో చాలా కొత్త విషయాలు తెలుసుకున్నానని అన్నారు.
  • కౌగిలింతకు, బలవంతపు కౌగిలింతకు తేడా తెలుసుకున్నానంటూ రాహుల్ కు సెటైర్ వేశారు. గత సెషన్లో రాఫెల్ గురించి ప్రసంగించిన రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి కౌగిలించుకుని కన్ను గీటిన విషయాన్ని సభకు గుర్తు చేశారాయన.
  • ఆ ప్రసంగానికి ముందు భూకంపం సృష్టిస్తానంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కూడా మోడీ వ్యగ్యాంస్త్రాలు విసిరారు. భూకంపం వస్తుందంటూ కొన్ని మాటలు విన్నామని, అలాంటిదేం జరగలేదని అన్నారు.

సహకారంతో బిల్లులు పాస్

  • వ్యర్థంగా ఉన్న చాలా చట్టాలను తమ ప్రభుత్వం తీసేసిందని మోడీ చెప్పారు. దాదాపు 1400 చట్టాలను తొలగించామన్నారు.
  • 16వ లోక్ సభలో జీఎస్టీ చట్టాన్ని తెచ్చామని, సభలో పార్టీల సహకారానికి ఈ బిల్లు పాస్ చేసిన తీరు నిదర్శనమని చెప్పారు.
  • మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏర్పడిందని మోడీ అన్నారు. అధిక సంఖ్యలో 44 మంది మహిళా ఎంపీలు ఉన్న సభ ఇదేనన్నారు.

Latest Updates