ఇర్ఫాన్ ఖాన్ మృతిపై మోడీ సంతాపం

ప్రపంచ సినిమా అరుదైన నటుడ్ని కోల్పోయిందని ట్వీట్
న్యూఢిల్లీ: వెర్సటైల్​ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విభిన్న మాధ్యమాల్లో విలక్షణ నటనకు గాను ఇర్ఫాన్ చిరకాలం గుర్తుండిపోతాడని మోడీ ట్వీట్ చేశారు. ‘సినిమా ప్రపంచానికి ఇర్ఫాన్ మృతి తీరని లోటు. అతడి కుటుంబం, మిత్రులతోపాటు ఫ్యాన్స్ తో నా ఆలోచనలు ముడిపడి ఉంటాయి. ఇర్ఫాన్ ఆత్మకు శాంతి కలగాలి’ అని ట్వీట్ లో చెప్పారు.

అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన సలాం బాంబే (1988)తో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఇర్ఫాన్ ఖాన్.. మక్బూల్ (2004), లైఫ్​ ఇన్ ఎ మెట్రో (2007), పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్ బాక్స్ (2013), హైదర్ (2014), గుండే (2014), పీకూ (2015), తల్వార్ (2015), హిందీ మీడియం (2017) సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాడు. సైనికుడు (2006) ఫిల్మ్​తో తెలుగు ఆడియన్స్ మెప్పునూ పొందాడు. స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్, లైఫ్ ఆఫ్​పై లాంటి ఇంటర్నేషనల్ చిత్రాల్లోనూ మెరిశాడు. 2011లో ఇండియా గవర్నమెంట్ నుంచి ఇర్ఫాన్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. అతడి భార్య పేరు సుతపా సిక్దర్. ఇర్ఫాన్ కు ఇద్దరు కొడుకులు. వారి పేర్లు బాబిల్, ఆర్యన్. శనివారం ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం చనిపోయిన విషయం తెలిసిందే.

Latest Updates