ఫిట్​నెస్​ పెంచుకొని అదరగొడుతున్న షమీ

చాలా టాలెంట్‌‌ ఉంది. బౌలింగ్‌‌లో మంచి స్పీడుంది.దానికి సీమ్‌‌ కూడా తోడుంది. రివర్స్‌‌ స్వింగ్‌‌ కింగ్‌‌గా పేరొచ్చింది..! అంతేనా.. వన్డేల్లో  వేగంగా యాభై వికెట్లు పడగొట్టిన ఇండియా సెకండ్‌‌ బౌలర్‌‌గా నిలిచాడు..! 2015 వన్డే వరల్డ్‌‌ కప్‌‌లో హైయెస్ట్‌‌ వికెట్‌‌ టేకర్‌‌గా అందరితో శభాష్‌‌ అనిపించుకున్నాడు..!  కెరీర్‌‌ మొదట్లో మహహ్మద్‌‌ షమీ సత్తా  ఇది.

అప్పట్లో అతని బౌలింగ్‌‌ చూసిన వాళ్లంతాఇండియాకు కత్తిలాంటి పేసర్‌‌ దొరికాడని అనుకున్నారు..! కానీ, గాయాలు అతడిని ఆడుకున్నాయి..!  రెండు మ్యాచ్‌‌ల్లో మెప్పించగానే.. మూడో మ్యాచ్‌‌కు అందుబాటులో ఉంటాడో లేదో తెలియని పరిస్థితిలోకి నెట్టాయి! పాత గాయం తిరగబెట్టడమో.. కొత్త గాయం కావడమో.. అన్నట్టు ఉండేది అతని దుస్థితి!  పైగా, భార్యతో గొడవలు పర్సనల్‌‌ లైఫ్‌‌ను దెబ్బతీశాయి..!

ఇలాంటి పరిస్థితుల్లో మెంటల్‌‌గానే కాదు ఫిజికల్‌‌గానూ ధృడంగా మారాడు షమీ!  ఫిట్‌‌నెస్ పెంచుకున్నాడు.. శరీరాన్ని మార్చుకున్నాడు…గాయాలు తప్పించుకున్నాడు..! బౌలింగ్‌‌ కోచ్‌‌ భరత్‌‌ అరుణ్‌‌ ప్రోద్భలంతో కెరీర్‌‌లో ఎప్పుడూ లేనంత ఫిట్‌‌గా మారాడు..!  ఫలితంగా ఇప్పుడు పిచ్‌‌తో,  ప్రత్యర్థితో సంబంధం లేకుండా సూపర్‌‌ హిట్‌‌ బౌలింగ్‌‌తో అదరగొడుతున్నాడు..!

టీమిండియా పేస్‌‌ బౌలింగ్‌‌ పదునెక్కింది. ప్రపంచంలోనే బెస్ట్‌‌గా మారింది.  స్టార్‌‌ పేసర్‌‌ జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా లేకపోయినా.. మన పేస్‌‌ అటాక్‌‌  యమ జోరు మీదుంది.  సీనియర్‌‌ ఇషాంత్‌‌ శర్మతో పాటు ఉమేశ్ యాదవ్‌‌, మహమ్మద్‌‌ షమీతో కూడిన పేస్‌‌ త్రయం అద్భుతంగా రాణిస్తోంది. అయితే, ఈ ముగ్గురిలో ఎప్పుడూ ప్రత్యేకతను చాటుకుంటున్నది మాత్రం షమీనే. పిచ్‌‌ లెక్కలతో పనిలేకున్నా  పేస్‌‌, సీమ్‌‌, స్వింగ్‌‌తో వైవిధ్యమైన బంతులతో వికెట్లను వేటాడుతున్నాడు. బంగ్లాదేశ్‌‌తో ఫస్ట్‌‌ టెస్టు విజయంలో అతనిది కీలక పాత్ర. హోల్కర్‌‌ స్టేడియంలో ఆట జరిగిన మూడు రోజులూ.. పిచ్‌‌ పేసర్లకు సహకరించింది. మ్యాచ్‌‌లో మొత్తం 26 వికెట్లు పడితే అందులో 19 వికెట్లు పేసర్లే తీశారు. ఈ లెక్కన పేస్‌‌ వికెట్‌‌పై రాణించడం మామూలు విషయమే అనిపించొచ్చు. అయితే, అంతకుముందు సౌతాఫ్రికాతో విశాఖపట్నం, పుణె, రాంచీలో జరిగిన మూడు మ్యాచ్‌‌ల్లో ఇండియా పరిస్థితులకు సరిపోయే వికెట్లనే ఉపయోగించారు. బ్యాట్స్‌‌మెన్‌‌కు ముందునుంచే ఫేవర్‌‌గా ఉండి, క్రమంగా స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌‌లు అవి. వీటిపై కూడా షమీ ఆరంభం నుంచే అదరగొట్టాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్‌‌ల్లో పాత, కొత్త బంతి అనే తేడా లేకుండా అద్భుత బౌలింగ్‌‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌‌మెన్‌‌ను వణికించాడు.  41–80 ఓవర్ల మధ్యలో షమీ యావరేజ్‌‌ 22 కావడం గమనార్హం. బాల్‌‌ బై బాల్‌‌ డాటా అందుబాటులోకి వచ్చాక 2002 నుంచి వెయ్యి పైచిలుకు బాల్స్‌‌ బౌలింగ్‌‌ చేసిన 79 మంది సీమర్లలో కేవలం ఐదుగురు మాత్రమే షమీ కంటే మెరుగైన సగటుతో ఉన్నారు. ఈ లెక్కన మనోడు ఎంత పవర్‌‌ఫుల్ బౌలర్‌‌గా మారాడో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ ఏడాది ఏడు టెస్టుల్లోనే 31 వికెట్లు పడగొట్టిన షమీ.. ఆస్ట్రేలియా పేసర్‌‌ పాట్‌‌ కమిన్స్ (43), ఇంగ్లండ్‌‌ వెటరన్‌‌ స్టార్‌‌ స్టువర్ట్‌‌ బ్రాడ్‌‌ (34) తర్వాత థర్డ్‌‌-మోస్ట్ సక్సెస్‌‌ఫుల్‌‌ బౌలర్‌‌గా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఇండియా ఫస్ట్‌‌ టైమ్‌‌.. పింక్‌‌ బాల్‌‌ మ్యాచ్‌‌ ఆడబోతున్న ఈడెన్‌‌ గార్డెన్స్‌‌.. షమీకి హోమ్‌‌గ్రౌండ్‌‌. అక్కడా అతనికి మంచి రికార్డే ఉంది. ఈడెన్‌‌లో ఆడిన మూడు టెస్టుల్లో షమీ 17.52 సగటుతో 21 వికెట్లు పడగొట్టాడు.

అప్పుడు గాయాలు ఇప్పుడు వికెట్లు

షమీ కెరీర్‌‌ గ్రాఫ్‌‌ను పరిశీలిస్తే ప్రస్తుతం అతను సెకండ్‌‌ అండ్‌‌ బెస్ట్‌‌ ఫేజ్‌‌లో ఉన్నాడనొచ్చు. టాలెంటెడ్‌‌ పేసర్‌‌గా టీమ్‌‌లోకి వచ్చి.. ఆరంభంలోనే సత్తా చాటుకున్నా నిలకడగా ఆడలేకపోయాడతను. తరచూ గాయాలపాలై జట్టులోకి వస్తూ పోతుండేవాడు. కానీ, ఫిట్‌‌నెస్‌‌ పెంచుకొని ఓవరాల్‌‌గా తనను తాను మార్చుకున్న షమీ సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌.. జెట్‌‌ స్పీడ్‌‌లో దూసుకెళ్తోంది. మ్యాచ్‌‌ రిజల్ట్‌‌కు కీలకమైన, పేసర్లకు అంతగా సహకారం అందని సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ల్లో షమీ బౌలింగ్‌‌కు తిరుగేలేకుండా పోయింది. అతనిప్పటిదాకా సాధించిన ఐదు ఫైవ్‌‌-వికెట్స్‌‌ హాల్స్‌‌లో నాలుగు సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ల్లో వచ్చినవే. శనివారం బంగ్లా క్రికెటర్‌‌ ముష్ఫికర్‌‌ రహీమ్‌‌ ఇచ్చిన క్యాచ్‌‌ను సెకండ్‌‌ స్లిప్‌‌లో రోహిత్‌‌ శర్మ అందుకొని ఉంటే మరో ఐదు వికెట్ల ఘనత షమీ ఖాతాలో పడేది. ఇండియా ముగ్గురు పేసర్లలో… సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌లో బెస్ట్‌‌ స్ట్రైక్‌‌-రేట్‌‌, యావరేజ్  కూడా షమీదే.  సెకండ్‌‌ ఇన్నింగ్స్‌‌ల్లో ప్రతీ 21.38 రన్స్‌‌కు, ప్రతీ నలభై బంతులకు ఒక వికెట్‌‌ తీస్తున్నాడతను. పిచ్‌‌ పాతబడిన తర్వాత కూడా అనూహ్యమైన సీమ్‌‌ రాబడుతూ బ్యాట్స్‌‌మెన్‌‌ను ఇబ్బంది పెట్టడం.. మిగతా పేసర్లకంటే షమీ స్పెషల్‌‌గా నిలుపుతోంది. శనివారం మహ్మద్‌‌ మిథున్‌‌ను ఔట్‌‌ చేసిన డెలివరీని అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. పిచ్‌‌ అయిన తర్వాత ఊహించినదానికంటే ఎక్కువ ఎత్తులో వచ్చిన సీమింగ్‌‌ బాల్‌‌ను ఎదుర్కొనే క్రమంలో మిథున్‌‌ గాబరా పడ్డాడు. అప్పటికే పుల్‌‌ షాట్‌‌ కొట్టడానికి సిద్ధమైన అతను ఆ షాట్‌‌ను విరమించుకోలేక మిడ్‌‌ వికెట్‌‌లో మయాంక్‌‌కు ఈజీ క్యాచ్‌‌ ఇచ్చాడు.

అండగా అరుణ్‌‌

గతంలో గాయాలను వెంటాడిన షమీ ఇప్పుడు వికెట్లను వేటాడడం ఊహించని మార్పు. ప్రతిభ ఉన్నప్పటికీ అతనింత నిలకడ సాధించేలా చేయడంలో.. ఓవరాల్‌‌గా ఓ కొత్త షమీని తయారు చేయడంలో టీమిండియా బౌలింగ్‌‌ కోచ్‌‌ భరత్‌‌ అరుణ్‌‌ పాత్ర కీలకం. టాలెంట్‌‌ విషయంలో వంక పెట్టాల్సిన అవసరం లేకున్నా.. ఫిట్‌‌నెస్‌‌ సమస్యలే అతడిని దెబ్బతీస్తున్నాయని అరుణ్‌‌ గ్రహించాడు. ఫిట్‌‌నెస్‌‌ పెంచుకుంటే కానీ గాయాల బారిన పడకుండా ఉండలేవని షమీకి హితబోద చేశాడు. అదే సమయంలో గతేడాది కుటుంబ సమస్యలు షమీని ఇబ్బంది పెట్టాయి. భార్యను వేధిస్తున్నాడన్న కేసు నేపథ్యంలో అతని కాంట్రాక్టును కూడా బీసీసీఐ హోల్డ్‌‌లో పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో మరెవరైనా కుంగిపోయే వాళ్లు. కానీ, షమీ మాత్రం భరత్‌‌ అరుణ్‌‌ చెప్పినట్టు ఫిట్‌‌నెస్‌‌పై ఫోకస్‌‌ పెట్టాడు. టీమిండియా మాజీ కండిషనింగ్‌‌ కోచ్‌‌ శంకర్‌‌ బసు ఆధ్వర్యంలో జిమ్‌‌లో, గ్రౌండ్‌‌లో గంటల కొద్ది కసరత్తులు చేసి చెమటలు చిందించాడు. డైట్‌‌ విషయంలోనూ జాగ్రత్త పడ్డాడు. ఎక్కువ తినకుండా… స్వీట్లు, బ్రెడ్‌‌ వంక చూడకుండా నోరు కట్టుకున్నాడు. బెంగాల్‌‌ తరఫున ఆడే కెరీర్‌‌ ప్రారంభ రోజుల నుంచి నడుం దగ్గర ఉన్న కొవ్వు కూడా కరిగిపోయిదంటే షమీ ఎంతలా కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. షమీని ఓ ఫిట్‌‌నెస్‌‌ ఫ్రీక్‌‌గా మార్చానని, అది తాను సాధించిన అతి పెద్ద విజయం అని బసూనే చెప్పాడు. ఫిట్‌‌గా మారిన తర్వాత ఈ సీజన్‌‌లో షమీ ఒక్క టెస్ట్‌‌ మ్యాచ్‌‌ కూడా మిస్సవలేదు. అన్ని మ్యాచ్‌‌ల్లోనూ ఒకే ఇంటెన్సిటీతో బౌలింగ్‌‌ చేశాడు. ఈ లెక్కన ఫిట్‌‌నెస్సే కాదు షమీ ఫేట్‌‌ కూడా మారింది.

Latest Updates