అన్నలూ లొంగిపోండి..నిర్మల్ లో సరెండర్ మేళా

అండర్‌‌గ్రౌండ్‌‌ మావోయిస్టులు లొంగుబాట పట్టేలా పోలీసులు మరోసారి ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఈ నెల 11న నిర్మల్‌‌ పోలీసులు సరెండర్‌‌ మేళా ఏర్పాటు చేశారు. జిల్లా నుంచి మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్న వారి కుటుంబసభ్యుల ఇళ్ల దగ్గరకు వెళ్లి కౌన్సిలింగ్‌‌ చేస్తున్న పోలీసులు వారిని మేళాకు ఆహ్వానించారు. ఇంతకు ముందు  ఎస్పీ శశిధర్‌‌రాజు మావోయిస్టు అగ్రనేత సట్వాజీ లొంగుబాటు కోసం చేసిన ప్రయత్నం సక్సెస్‌‌ కావడంతో మరోసారి అదే ఎత్తుగడ వేశారు. ఐజీ ప్రదీప్‌‌కుమార్ ఈమధ్య నిర్మల్ వచ్చి లొంగుబాట్లపై శశిధర్ రాజుతో చర్చించారని తెల్సింది. ఆయన సూచనతోనే  పోలీసులు మావోయిస్టుల కుటుంబాలను కలిశారు. లొంగిపోతే పునరావాసం, ఉపాధి కల్పిస్తామని నచ్చచెప్తున్నారు. అండర్‌‌గ్రౌండ్‌‌లో ఉన్నవారు లొంగిపోవాలని వారి పేరెంట్స్‌‌తో సరెండర్‌‌ మేళాలో అప్పీలు చేయించనున్నారు. ఖానాపూర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు నేతలు తూము శ్రీనివాస్ , గోసుబాయి, లింగవ్వ ప్రస్తుతం చత్తీస్‌‌గఢ్‌‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌‌లలో దళాల్లో కీలక బాధ్యతల్లో ఉన్నట్టు సమాచారం. వారి కుటుంబీకులను బుధవారం పోలీసులు కలిసి సరెండర్‌‌ అయ్యేలా పిలుపునివ్వాలని కోరారు. నిర్మల్ ప్రాంతానికి చెందిన ఇరివి మోహన్ రెడ్డి  మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ తదితరులను కూడా సరెండరయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నారు .ఉమ్మడి జిల్లాకు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, బండి ప్రకాష్ అగ్రనేతలు కూడా సరెండర్‌‌ అయ్యేలా పోలీసులు ఎత్తుగడలు వేస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత సట్వాజీ, ఆయన భార్య మాధవి సరెండర్ కావడానికి ముందు నిర్మల్‌‌ పోలీసులు అనుసరించిన పద్దతే మరోసారి అమలు చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే లొంగిపోయిన మాజీ మావోయిస్టుల సహకారం కూడా తీసుకోనున్నారు.

 

Latest Updates