డిమాండ్ ఎక్కువ..పైసలు తక్కువ

వెలుగు, బిజినెస్‌‌డెస్క్‌‌: మనదేశంలో ఎండోమెంట్‌‌/మనీబ్యాక్‌‌ పాలసీలకు డిమాండ్​ బాగా ఎక్కువ. వీటిని కొంటే బాగుంటుందని ఏజెంట్లు కస్టమర్లకు చెబుతుంటారు. అయితే వాళ్లు చెప్పినన్ని లాభాలు ఈ పాలసీలతో వస్తాయా? ఈ ప్రశ్నకు జవాబు చెప్పుకునేముందు ఏజెంట్లు ఈ ప్లాన్లను అమ్మడానికి ఎందుకు ఆసక్తి చూపుతారో తెలుసుకోవాలి.  మనీబ్యాక్‌‌ పాలసీపై ఏకంగా 35 శాతం వరకు కమీషన్‌‌ ఇస్తారు. ప్రీమియం ఎంత ఎక్కువ ఉంటే, కమీషన్ అంత ఎక్కువ అన్నమాట. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే మొదటి ఏడాది ప్రీమియంను కొన్ని కంపెనీలు ఏజెంట్లకు కమీషన్‌‌గా ఇస్తాయి.  బాగా డబ్బులు వస్తాయి కాబట్టి వీటిని కొనాలని ఏజెంట్లు ప్రజలపై ఒత్తిడి తేవడం సహజం. నిజానికి మనీబ్యాక్‌‌ పాలసీల్లో పెట్టుబడి ఎక్కువ లాభం, బీమా ప్రయోజనాలు చాలా తక్కువ. అయినప్పటికీ ఇలాంటి పాలసీలే ఎక్కువ అమ్ముడవుతున్నాయి. కొంత డబ్బు వెనక్కి రావడం, కొద్దిగా బీమా కవరేజీ ఉండటం వల్ల జనం వీటికి ఆసక్తి చూపుతున్నారని ముంబైకి చెందిన ఫైనాన్షియల్​ ఎనలిస్టు ఒకరు అన్నారు.

కొనే ముందు జాగ్రత్త!

పన్ను మొత్తాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది హడావుడిగా పాలసీలను కొంటుంటారు. అసలు బీమా ఎందుకు ? అందులో కవరేజీ ఎంత ఉంటుంది.. వంటి ముఖ్యమైన విషయాలను కూడా పట్టించుకోరు.  మనీబ్యాక్‌‌ పాలసీల గురించి చాలా మందికి కనీస అవగాహన ఉండదు. వీటిని ఎందుకు కొనకూడదో ఇప్పుడు చూద్దాం.  మనీబ్యాక్‌‌ పాలసీలు పెట్టుబడులుగానూ, బీమా పాలసీలుగానూ పనిచేస్తాయి. రెండు పాలసీలు కొనాల్సిన అవసరం లేకుండా బండిల్‌‌గా ఈ పాలసీ ఇస్తారు. అంతవరకు బాగానే ఉన్నా, రాబడులు, బీమా కవరేజీ చాలా తక్కువ. అంటే పాలసీహోల్డర్‌‌ కంటే ఏజెంట్‌‌కు లాభం ఎక్కువ ఉంటుంది.

రాబడులూ తక్కువ.. పెట్టుబడి ఎక్కువ

మనీబ్యాక్‌‌ పాలసీల్లో కొంత మొత్తాన్ని బీమాకు, మిగతా దాన్ని పెట్టుబడులకు ఖర్చు చేస్తారు. అంటే, ఇన్వెస్ట్‌‌మెంట్‌‌కు పెట్టే మొత్తం చాలా తగ్గుతుంది. ఎల్‌‌ఐసీ వెబ్‌‌సైట్‌‌ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 30 ఏళ్ల వ్యక్తి 35 ఏళ్ల కాలానికి రూ.లక్ష బీమా కోసం ఏటా రూ.3,165 కట్టాలి. అంటే 35 ఏళ్లలో అతడు కట్టే మొత్తం రూ.1.10 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ తరువాత చేతికి అందే మొత్తం రూ.2.56 లక్షలు. ఏటా 8 శాతం వడ్డీ కలిపితే వచ్చే మొత్తం ఇది. మనం కట్టే డబ్బుల్లో కొంత మొత్తానికే వడ్డీ వర్తిస్తుంది.  ఇంతేమొత్తాన్ని పబ్లిక్ ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ (పీపీఎఫ్‌‌)లో ఇన్వెస్ట్‌‌ చేస్తే 35 ఏళ్లలో రూ.ఐదు లక్షలకుపైగా వస్తాయి. పీపీఎఫ్‌‌ కూడా ఏటా ఎనిమిది శాతం వరకు వడ్డీ ఇస్తుంది. ఏరకంగా చూసినా ఎల్‌‌ఐసీ ఇచ్చే మొత్తం పీపీఎఫ్‌‌తో వచ్చే దానికంటే చాలా తక్కువ. ఎల్‌‌ఐసీ మనం చెల్లించే పూర్తి మొత్తాన్ని ఇన్వెస్ట్‌‌మెంట్‌‌చేయకపోవడం వల్లే మెచ్యూరిటీ మొత్తం రూ.1.10 లక్షలే వస్తోంది! నికర రాబడి 4–5 శాతం మించదు.

ఇలా చేస్తే బెటర్‌‌

రూ.50 లక్షల విలువైన బీమా కవరేజీ కావాలనుకునేవాళ్లు ఇలా చేయాలి. ఏటా రూ.ఏడు వేలు చెల్లిస్తే రూ.50 లక్షల విలువైన టర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ వస్తుంది. మిగతా రూ.1.50 లక్షలను పీపీఎఫ్‌‌లో పెట్టాలి. మరో రూ.76 వేలను ఈక్విటీ ఫండ్స్‌‌లోకి మళ్లించాలి. మొత్తం రూ.2.33 లక్షలు అవుతుంది (జీవన్‌‌ ఆనంద్‌‌ పాలసీకి అయ్యే మొత్తానికి సమానం)

25 ఏళ్ల తరువాత…

పాతికేళ్ల తరువాత పాలసీహోల్డర్‌‌ సజీవంగా ఉంటే, సంప్రదాయ పాలసీ ద్వారా అయితే రూ.1.17 కోట్లు వస్తుంది. టెర్మ్‌‌ ప్లాన్‌‌ ద్వారా ఏమీ రాదు. పీపీఎఫ్‌‌ పెట్టుబడి రూ.1.18 కోట్లు అవుతుంది. ఈక్విటీ ఫండ్స్‌‌ నుంచి దాదాపు రూ.82 లక్షలు రావొచ్చు  . ఈ మొత్తం రూ.రెండు కోట్లు అవుతుంది. అంటే ఏరకంగా చూసినా ఎండోమెంట్‌‌  పాలసీల కంటే పైన చెప్పుకున్న విధానం ఎంతో మేలు.

సాధారణ పాలసీల్లో  బీమా ఇలా..

ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తికి 25 ఏళ్ల కాలానికి రూ.50 లక్షల కవరేజీ ఉండే పాలసీని ఎల్‌‌ఐసీ (జీవన్‌‌ ఆనంద్‌‌) నుంచి తీసుకుంటే ఏటా రూ.2.33 లక్షలు ప్రీమియంగా కట్టాలి. అయితే, రూ.7,000–రూ.8000 వరకు చెల్లిస్తే టర్మ్‌‌ ఇన్సూరెన్స్‌‌ పాలసీ ద్వారా ఇంతేమొత్తం ఇన్సూరెన్స్‌‌ కవరేజీ ఇస్తారు! తేడాను గమనిస్తే ఆశ్చర్యం అనిపించకమానదు. చాలా మందికి తమకు అనువైన బీమా పాలసీ గురించి తెలియదు. భారీ మొత్తంలో కవరేజీ (రూ.50 లక్షలు అనుకుందాం) కావాలని ఏజెంటుకు చెబితే అతడు ప్రీమియం లక్షల రూపాయలు ఉంటుందని చెబుతాడు. చాలా మంది ఇది వరకే ఎండోమెంట్‌‌/మనీబ్యాక్‌‌ పాలసీలు తీసుకొని ఉంటారు కాబట్టి మళ్లీ అవే తరహా పాలసీలు తీసుకుంటారు. రూ.5 లక్షలు–రూ.10 లక్షల వరకు మాత్రమే బీమా తీసుకుంటారు. చెల్లించే ప్రీమియం మాత్రం ఎక్కువ ఉంటుంది. ఈ బీమా కవరేజీ ఈ రోజుల్లో ఎంతమాత్రమూ సరిపోదు. టర్మ్‌‌ ఇన్సూరెన్స్ పాలసీల గురించి తెలియకపోవడం వల్లే ఇలా జరుగుతుంటుంది.

Latest Updates