మద్యం టెండర్లలో మహిళలే అధికం

  • మద్యం టెండర్లలో మగువలే అధికం
  • 595 షాపులకు 8,692 టెండర్లు
  • చివరి రోజు 5064 టెండర్లు స్వీకరణ
  • ఎక్సైజ్‌‌ శాఖకు  రూ.173 కోట్ల ఆదాయం

రంగారెడ్డి జిల్లా, వెలుగునిన్న, మొన్నటి వరకు మద్యం షాపులకు టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు బుధవారం చివరి తేదీ కావడంతో గుంపులు గుంపులుగా వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలో కలిపి మొత్తం 595 షాపులున్నాయి. వీటికి 8,692 మంది టెండర్లు దాఖలు చేశారు. వీటిలో హైదరాబాద్‌‌ జిల్లా 173 షాపులకు 1238, రంగారెడ్డి జిల్లాలో 422 షాపులకు 7454 మంది  టెండర్లు వేశారు. మంగళవారం నాటికి హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని 595 షాపులకు 3628 టెండర్లు మాత్రమే వచ్చాయి. కానీ బుధవారం ఒక్క రోజే 5064 మంది టెండర్లు వేయడం విశేషం.

హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని 595 షాపులకు 8692 మంది టెండర్లు వేస్తే… వీటిలో 3000 వరకు మహిళలే టెండర్లు వేసినట్లు అధికారిక వర్గాలు తెలియజేస్తున్నాయి. మద్యం వ్యాపారుల తల్లులు, భార్యలు, కూతళ్లు, కోడళ్ల పేర్లపై టెండర్లు వేసినట్లు సమాచారం.

టెండర్లతో ఎక్సైజ్‌‌ ఆదాయం రూ.173 కోట్లు

మద్యం టెండర్ల ద్వారా హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని షాపులకు కలిపి వేసిన దరఖాస్తులతో ఎక్సైజ్‌‌ శాఖకు రూ.173.84 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్‌‌లోని 173 షాపుల ద్వారా రూ.24.76 కోట్లు, రంగారెడ్డి జిల్లాలోని 422 షాపులకు రూ.149.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వివరించారు. గతంలో రంగారెడ్డి జిల్లాలోని 412 షాపులకు 5667 దరఖాస్తులకు రూ.56.67 కోట్లు, హైదరాబాద్‌‌ జిల్లాలో 183 షాపులకు 630 దరఖాస్తులకు రూ.6.30 కోట్ల ఆదాయం రాగా మొత్తం రూ.62.97 కోట్లు వచ్చింది. గతంతో పోలిస్తే సుమారుగా రూ.111 కోట్లు హైదరాబాద్‌‌, రంగారెడ్డి జిల్లాలోని షాపుల ద్వారా ఎక్సైజ్‌‌కు ఆదాయం సమకూరింది.

వికారాబాద్ జిల్లా:   వికారాబాద్ జిల్లాలో 18 మండలాలకు గాను 47  మద్యం షాపులు ఉన్నాయి. ఈ షాపు లకు గాను  దరఖాస్తులను స్వీకరించినట్లు వరప్రసాద్​ తెలిపారు.  జిల్లాలో అధికంగా ధారూరు మండల కేంద్రంలో ఉన్న వైన్ షాప్ కు 42 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన దరఖాస్తులకు ఈనెల  18న అంబేద్కర్ భవనంలో ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానమ్ సమక్షంలో డ్రా తో తీ యబడుతుందన్నారు. దరఖాస్తులు చేసుకునేందుకు చివరి రోజు కావడంతో దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో వచ్చారని తెలిపారు.

ఎల్ బీ నగర్: మద్యం టెండర్ల విషయంలో ఎవ్వరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. నాగోలు అనంతుల రాంరెడ్డి ఫక్షన్‌‌ హాల్లో మల్కాజ్ గిరి ఎక్సైజ్ యూనిట్ ఆధ్వర్యంలో నూతన మద్యం పాలసీ దరఖాస్తుల స్వీకరణ చివరి రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 18న జరిగే డ్రాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ మంది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైన్ షాపులు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. డ్రాలో పాల్గొనే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు . ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ఎక్సైజ్ అధికారులు ప్రదీప్ రావు, గణేష్ , చంద్రశేఖర్ గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

టెండర్ల వద్ద రెండు వర్గాలు తోపులాట

నాగోలు అనంతుల రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో మద్యం టెండర్ల లో బుధవారం రెండు వర్గాల తోపులాట జరిగింది . టెండర్లు దక్కించుకోవడంలో లోకల్ నాన్ లోకల్ విభేదాలతో తోపులాట జరిగింది. మా ఏరియా లోకి వచ్చి మీరు ఎలా ఎలా టెండర్లు వేస్తారు . . నాన్ లోకల్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడే ఉన్న ఎల్బీనగర్ పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పి గొడవ కాకుండా చూశారు.

Latest Updates