ఓట్ల లెక్కింపుతో ఒత్తిడి: 270మందికిపైగా చనిపోయారు

ఎన్నికలు ఒకెత్తు. కౌంటింగ్​ మరో ఎత్తు. ఆ లెక్కింపే ఇండొనేసియాలో సిబ్బంది చావుకొచ్చింది.ఓట్లు లెక్కబెట్టలేక ఒత్తిడి, అలసటకు లోనై 270 మందికిపైగా చనిపోయారు. అందులో భద్రతా, ఇతరసిబ్బంది ఉన్నారు. ఖర్చు తగ్గుతుందని ఒకేసారి అన్ని ఎన్నికలు పెట్టాలని కోర్టు ఇచ్చిన ఆదేశాలే ఇంతటి దుస్థితికి కారణమైంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, పార్లమెంటరీ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఏప్రిల్ 17న ఒకేసారి ఎన్నికలను నిర్వహించింది ప్రభుత్వం. ఒక్కొక్క ఓటరు ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి వచ్చింది. 19.3 కోట్ల మంది ఓటర్లుండగా 80 శాతం పోలింగ్​ నమోదైంది. అయితే అన్ని ఓట్లను చేత్తో లెక్కపెట్టాలంటే పెద్దపనే. దీంతో పది రోజులుగా లెక్కింపు సాగుతోంది. ఆ లెక్కింపులోనే చాలా మంది సిబ్బంది ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నారు. శనివారం రాత్రి నాటికి 272 మంది అధికారులు, సిబ్బంది చనిపోయినట్టు ఇండొనేసియా జనరల్ ఎలక్షన్స్​ కమిషన్​ (కేపీయూ) ప్రతినిధి ఆరీఫ్​ ప్రియో శుశాంటో తెలిపారు. 1878 మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. అనారోగ్యానికి గురైన ఎన్నికల అధికారులకు చికిత్స అందించేందుకు హెల్త్​ ఫెసిలిటీలను ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిందని, చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇచ్చేదిశగా ఆర్థికశాఖ కృషి చేస్తోందని అన్నారు.

ఎన్నికల సంఘంపై తిట్లే తిట్లు
ఎన్నికల సిబ్బంది మరణాల పట్ల కేపీయూపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది పని భారంపై ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకోలేకపోయిందని ఉపాధ్యక్ష పదవికి బరిలో నిలిచిన ప్రతిపక్ష సభ్యుడు అహ్మద్​ ముజానీ ఆరోపించారు. అధ్యక్షుడు జోకోవిడోడోకు అనుకూలంగా ఎన్నికల అధికారులు పనిచేశారని అన్నారు. ఎన్నికల్లో అడుగడుగునా మోసాలే జరిగాయన్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను ఆ దేశరక్షణ మంత్రి తోసిపుచ్చారు. వాటిలో నిజం లేదన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో 10 పర్సంటేజీ పాయింట్లతో ప్రస్తుత అధ్యక్షుడు జోకో విడోడోనే గెలుపొందారు.ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై పార్లమెంట్ లో సమీక్షిస్తామని, మరింత సమర్థమైన మార్గాల్లో ఎన్నికలు జరిపేందుకు కృషి చేస్తామని హోం శాఖమంత్రి తజహ్జో కుమోలో చెప్పారు . అధ్యక్ష, అసెంబ్లీఎన్నికలను వేర్వేరుగా నిర్వహించే అంశంపై ఇప్పటికేఎన్నికల సంఘం ప్రతిపాదించిందన్నారు.


30 గంటలు నిద్రలేదు
రూడీ మాల్యా.. 57 ఏళ్ల రిటైర్డ్​ సెక్యూరిటీ గార్డ్​. ఎన్నికల్లో భాగంగా ఈస్ట్​ జకార్తాలో ఎన్నికల భద్రత చీఫ్​ ఆర్గనైజర్​గా డ్యూటీ పడింది. బ్యాలెట్ పేపర్లు, ఓటర్లను జాగ్రత్తగా చూసుకోవడం పని. అప్పగించిన పనిని చాలా శ్రద్ధతో చేశారాయన. 30 గంటల పాటు కంటి మీదకునుకు లేకుండా డ్యూటీ చేశారు. పైగా 2014లాగేఎన్నికల్లో మోసాలు జరిగే అవకాశాలున్నాయంటూ పెద్దపెట్టున ఆరోపణలు రావడంతో అతడు ఇంకా స్ట్రిక్ట్​గా పనిచేశాడు. దీంతో నిద్ర కూడా పోకుండా డ్యూటీచేయడంతో ఒత్తిడి ఎక్కువైందని అతడి భార్య సుకే సిచెప్పింది. బాత్రూంకు వెళ్లినా బ్యాలెట్ బాక్సులపై ఓకన్నేసి ఉంచేందుకు తన సహచరులతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా పర్యవేక్షించే వాడని చెప్పింది. ఎన్నికలైన తెల్లారే తలనొప్పి వస్తుందంటూ కుప్పకూలాడాని, వాంతులు చేసుకున్నాడని చెప్పింది. ఆవెంటనే చనిపోయాడని ఏడ్చింది. ఇంకో ఘటనలో ఓ పోలీసు అధికారి నిద్ర లేకపోవడం వల్ల కారు డ్రైవ్​ చేస్తూ నిద్రపోయాడు. ముగ్గురు యూనివర్సిటీ విద్యార్థులకు యాక్సిడెంట్ చేశాడు. బోర్నియోలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులూ చనిపోయారు.ఇవి మచ్చుకు కొన్ని ఘటనలే. చనిపోయిన వారందరిదీ దాదాపు ఇదే పరిస్థితి.

Latest Updates