కోటీశ్వరుల కార్ఖానా.. ఇన్ఫోసిస్‌

కోటీశ్వరుల కార్ఖానా.. ఇన్ఫోసిస్‌

దేశంలో టాప్‌‌ ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌‌లో కోటీశ్వరులు పెరుగుతున్నరు. ఏడాదికి రూ.కోటికిపైగా జీతం తీసుకుంటున్న వాళ్లు ఎక్కువైతున్నరు. ఈ ఆర్థిక సంవత్సరం 60 మందికిపైగా రూ.కోటి జీతం తీసుకున్నరు. కంపెనీ షేర్‌‌ విలువ పెరగడంతో స్టాక్‌‌ విలువ కూడా పెరిగి చాలా మందికి కంపెనీ ‘కంపెన్సేషన్‌‌’ కలిసొచ్చింది. గత ఆర్థిక సంవత్సరం (2017–18)లో 28 మంది రూ.కోటికిపైగా జీతం ఎత్తితే ఈసారి ఆ సంఖ్య 64కు పెరిగింది. చాలా మంది కంపెనీ సీనియర్‌‌ వైస్‌‌ ప్రెడిడెంట్లు, వైస్‌‌ ప్రెసిడెంట్లు ఇప్పటికే ఈ క్లబ్బులో చేరారు.

ఒక్కొక్కరికి ఒక్కొక్కలా…

కంపెనీ కార్పొరేట్‌‌ స్ట్రాటజీ, రిస్క్‌‌ విభాగాన్ని పరిశీలించే పి.దీపక్‌‌ మొత్తం (గ్రాస్‌‌) శాలరీ గతేడాది కన్నా 75 శాతం పెరిగింది. ఆయనకు 2018లో రూ.1.81 కోట్లొస్తే ఈసారి రూ.3.16 కోట్లకు పెరిగింది. గ్లోబల్‌‌ ఇమిగ్రేషన్‌‌ హెడ్‌‌ కౌశిక్‌‌ జీతం కూడా 41 శాతం పెరిగింది. గ్లోబల్‌‌ టాలెంట్‌‌, టెక్నాలజీ హెడ్‌‌ బినోద్‌‌ హంపాపూర్‌‌కు 30 శాతం రెమ్యునరేషన్‌‌ పెరిగి రూ.5.2 కోట్లొచ్చింది. చాలా మంది ఉద్యోగుల స్టాక్‌‌ విలువ పెరిగి జీతం పెరిగిందని కంపెనీ వెల్లడించింది. జీతంలో శాలరీలో ఫిక్స్‌‌ పే, వేరియబుల్‌‌ పే, రిటైర్‌‌ అయ్యాక వచ్చే లాభాలు,  స్టాక్‌‌ ఇన్సెంటివ్‌‌ ఉంటాయంది. ఇన్ఫోసిస్‌‌ ఉద్యోగి సగటు  జీతం ఈ ఆర్థిక సంవత్సరం రూ.6.2 లక్షలు. ఇది గతేడాది కన్నా 5 శాతం ఎక్కువ.

సీఈవో సలిల్‌‌కు రూ.24.6 కోట్లు…

కంపెనీ టాప్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌లలో సీఈవో సలీల్‌‌ పరేఖ్‌‌ ఈ ఆర్థిక సంవత్సరం రూ.24.6 కోట్ల కంపెన్సేషన్‌‌  పొందారు. ఇందులో రూ.7.6 కోట్ల స్టాక్‌‌ ఆప్షన్లు కూడా ఉన్నాయి. చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌ యూబీ ప్రవీణ్‌‌ రావ్‌‌ రూ.9.1 కోట్లు తీసుకున్నారు. ఇన్ఫోసిస్‌‌ ప్రెసిడెంట్‌‌ మోహిత్‌‌ జోషికి రూ.15 కోట్లు వచ్చాయి. చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌ రవికుమార్‌‌కు రూ.13.2 కోట్ల జీతమొచ్చింది. చాలా మంది సీనియర్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌లకు ఏడాదికోసారి ఇచ్చే స్టాక్‌‌ ఇన్సెంటివ్స్‌‌ ఎప్పటిలానే ఈఏడాదీ ఇచ్చారు. ఉద్యోగులను ప్రోత్సహించడానికి ఇన్ఫోసిన్‌‌ 2015లో స్టాక్‌‌ ఇన్సెంటివ్ కంపెన్సేషన్‌‌ ప్లాన్‌‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బాగా పని చేసిన వారికి షేర్లలో వాటా ఇస్తారు.  రూ.3,700 కోట్ల విలువైన 5 కోట్ల షేర్లను ఉద్యోగి పనితనానికి  కేటాయించినట్టు గతవారమే కంపెనీ ప్రకటించింది. 2018 ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే 2019లో స్టాక్‌‌ విలువ సరాసరి 35 శాతం పెరిగిందని, దీంతో ఆటోమెటిక్‌‌గా శాలరీలు, వచ్చే కంపెన్సేషన్‌‌ పెరుగుతాయని వివరించింది.