దేశంలో సగానికి పైగా కరోనా కేసులు ఈ 7 సిటీల్లోనే..

  • ఢిల్లీ, అహ్మదాబాద్​దీ అదే పరిస్థితి
  • ఇండోర్​, పుణె, చెన్నై, హైదరాబాద్​లోనూ తీవ్రం
  • ఈ సిటీల్లోనే 17,235 కేసులు.. 642 మరణాలు
  • 307 జిల్లాల్లో జీరో కేసులు..
  • 170 జిల్లాల నుంచి 129కి తగ్గిన హాట్​స్పాట్​లు

వెలుగు సెంట్రల్​డెస్క్​పల్లెలు ప్రశాంతంగానే ఉన్నాయి. కరోనా మహమ్మారి జాడ లేకుండా పకడ్బందీగా నిలుస్తున్నాయి. గ్రీన్​జోన్​లకు కేరాఫ్​ అడ్రస్​గా మారాయి. సిటీల్లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి ఐదారు సిటీల్లోనే సగానికిపైగా కేసులు నమోదయ్యాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుముఖం పడుతున్నా పరిస్థితి ఇంకా సీరియస్​గానే ఉంది. అయితే, గతి తప్పిన ఎకానమీని గాడిలో పెట్టేందుకు కేంద్రం లాక్​డౌన్​లో కొన్ని సడలింపులిచ్చింది. రూరల్​లో ఎకానమీని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో ఇప్పటికే చాలా చోట్ల ఇండస్ట్రీలు, ఉపాధి హామీ పనులు మొదలైపోయాయి.

ఆ సిటీల్లోనే సగానికిపైగా కేసులు

మెట్రో సిటీలు సహా కొన్ని మెయిన్​ సిటీలపైనే కరోనా మహమ్మారి విరుచుకుపడింది. రోజూ కొన్ని వందల మందికి సోకి, పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటోంది. సగానికిపైగా కేసులు, మరణాలు ఆయా సిటీల్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్​, ఇండోర్​, పుణె, చెన్నై, హైదరాబాద్​లలో పరిస్థితి సీరియస్​గా ఉంది. ఈ మొత్తం సిటీల్లో కలిపి 17,794 కేసులు రిపోర్ట్​ అయ్యాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో ఈ సిటీల్లో నమోదైన కేసుల వాటా 51%. మొత్తం 1,154 మంది చనిపోతే ఈ సిటీల్లోనే 690 మంది మృతిచెందారు. వాటా దాదాపు 60 శాతం.

కోలుకుంటున్నరు.. డబ్లింగ్​ రేటు మెరుగు

ఓ వైపు దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. దాని నుంచి కోలుకుంటున్నోళ్ల సంఖ్యా పెరుగుతోంది. మొత్తం 34,780 కేసులు కాగా ఇప్పటిదాకా 9,068 మంది కరోనా నుంచి బయటపడ్డారు. 26 శాతం మంది మహమ్మారిని ఓడించారు. దీంతో కరోనా పోరులో పాజిటివ్​ సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేసులు రెట్టింపయ్యేందుకు పట్టే టైం (డబ్లింగ్​ రేట్​) కూడా పెరుగుతోంది. డబ్లింగ్​ రేట్​ 11 రోజులకు పెరిగింది. వారం క్రితం డబ్లింగ్​ రేటు 8 రోజులుగా ఉంది. ఇప్పుడు మరో 3 రోజులు పెరిగి, మరింత మెరుగైంది. మరణాల రేటు కూడా మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర బెటర్​గానే ఉంది. 3.2 శాతంగా ఉంది. కొన్ని దేశాల్లో 5 నుంచి 14 శాతం దాకా మరణాల రేటు ఉంది. దేశంలో గురువారం ఒక్కరోజే 1,717 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,154 మంది మరణించగా, గురువారం 75మంది బలయ్యారు. ప్రస్తుతం 24,558 మంది ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

పల్లెల్లో ఎకానమీకి ఊతం

కొన్ని ఆంక్షల నడుమ ఊళ్లలో ఎకానమీని గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడిప్పుడే లాక్​డౌన్​లో కొన్ని ఆంక్షలను తొలగిస్తూ, చిన్న చిన్న బిజినెస్​లు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. రాష్ట్రాల్లో నిర్మాణ రంగ పనులూ చేసుకోవచ్చని సూచించింది. అందుకు తగ్గట్టు చిక్కుకుపోయిన వలస కూలీలను ఆయా పనులకు నియమించుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోని వలస కూలీలను వారి వారి సొంతూళ్లకు పంపించేందుకూ ఆంక్షలను సడలించింది. పని లేక ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఊరటనివ్వడంతో పాటు, ఊళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వారితోనే పనులు చేయించుకునేలా సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని పరిశ్రమలు మొదలైన నేపథ్యంలో వాటిలో వారికి పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటుంది. అంతేగాకుండా ఉపాధి హామీ పథకం పనులనూ మొదలుపెట్టింది. వలస కూలీలకు వాటి ద్వారా ఆసరా ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కోసం రూ.33,300 కోట్లు కేటాయించింది. అందులో పాత అప్పులు తీర్చేందుకు రూ.20,624 కోట్లు కేటాయించగా, మిగతా మొత్తాన్ని ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే పనులకు వాడుకోవాలని సూచించింది. జూన్​ వరకు ఆ నిధులు సరిపోతాయని పేర్కొంది. కేంద్రం సూచనలకు తగ్గట్టు ఇప్పటికే వివిధ రాష్ట్రాలు వలస కార్మికులను తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.

ముంబైపై ముప్పేట దాడి

ఆర్థిక రాజధాని ముంబైపై కరోనా ముప్పేట దాడి చేసింది. వేల మందికి సోకింది. వందలాది మందిని బలి తీసుకుంది. కేసులు, మరణాల్లో ముంబై మహానగరమే టాప్​లో ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రం మొత్తం మీద 10 ,498 కేసులు నమోదైతే ఒక్క ముంబైలోనే 7,061 మంది కరోనా బారిన పడ్డారు. అంటే రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 67 శాతం కేసులు ఒక్క ముంబైలోనే ఉన్నాయి. మరణాల్లోనూ అదే పరిస్థితి. మొత్తం 459 మంది చనిపోతే ముంబైలో 290 మంది కరోనాకు బలయ్యారు. 63 శాతం మరణాలు అక్కడే నమోదయ్యాయి. సిటీలో 936 మంది కోలుకోగా, 5,835 మంది ఇంకా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

పుణేలోనూ అంతే

పుణేలోనూ కేసులు, మరణాలు ఎక్కువే ఉన్నా యి. 1,248 మంది కరోనా బారిన పడితే 88 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 244 మంది కోలుకుంటే 916 మంది ఆస్పత్రుల్లోనే ఉన్నారు.

హైదరాబాద్​

మన రాష్ట్రంలో కరోనా హాట్​స్పాట్​లలో ముందున్నది రాజధాని హైదరాబాదే. మర్కజ్​కు వెళ్లొచ్చిన వాళ్లతోనే కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో 1,038 కేసులు నమోదైతే హైదరాబాద్​లోనే 548 కేసులు రిపోర్ట్​ అయ్యాయి. 53 శాతం కేసులు హైదరాబాద్​లోనే ఉన్నాయి. మొత్తం 25 మంది చనిపోతే హైదరాబాద్​లోనే 21 మంది చనిపోయారు. మరణాల్లో సిటీ వాటా 75 శాతం. సిటీలో ఇప్పటిదాకా 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా ఆస్పత్రుల్లో 376 మంది ఉన్నారు.

అహ్మదాబాద్​దీ అదే దారి

అహ్మదాబాద్​ పరిస్థితీ దారుణంగానే ఉంది. గుజరాత్​లో మొత్తం కేసులు 4,395గా ఉంటే, అహ్మదాబాద్​లోనే 3,026 మంది కరోనా పేషెంట్లున్నారు. అంటే రాష్ట్రంలో 68 శాతం కేసులు ఇక్కడివే. మొత్తంగా 214 మంది చనిపోతే ఒక్క 149 మరణాలు అహ్మదాబాద్​లో నమోదైనవే. మరణాల వాటా 69 శాతం. 316 మంది కోలుకోగా, ఇంకా 2,561 మంది ఆస్పత్రుల్లో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

ఇండోర్​ డేంజర్​

కేసుల పరంగా మధ్యప్రదేశ్​ కొంచెం ఫర్వాలేదనిపించినా, క్లీనెస్ట్​ సిటీగా పేరుపొందిన ఇండోర్​ మాత్రం కరోనాకు కేరాఫ్​ అడ్రస్​గా మారింది. రాష్ట్రంలో మొత్తం 2,625 కేసులు నమోదైతే ఒక్క ఇండోర్​లోనే 1,486  మందికి కరోనా సోకింది. 57 శాతం కేసులు అక్కడే ఉన్నాయి. 137 మంది చనిపోతే, అందులో 68 మంది అంటే 50 శాతం మంది ఇండోర్​కు చెందినవాళ్లే ఉన్నారు. ఇప్పటిదాకా అక్కడ 177 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఇంకా 1,241 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఇక్కడి స్ట్రెయిన్​ దేశంలోనే డేంజర్​ అని సైంటిస్టులు చెబుతున్న సంగతి తెలిసందే.

ఢిల్లీ పరిస్థితి

ఢిల్లీలో 3,515 కేసులు రిపోర్టయ్యాయి. 59 మంది చనిపోయారు. అక్కడ కేసులు పెరగడానికి కారణం మర్కజ్​. తబ్లిగీ మీటింగ్​లు జరిగిన మర్కజ్​ మసీదు ఢిల్లీలోని నిజాముద్దీన్​లోనే ఉంది. ఒక్కసారిగా అక్కడ కేసులు బయటపడడంతో ఆ ప్రాంతాన్ని మూసేసి నియంత్రణ చర్యలు చేపట్టారు. అధికారులు చేపట్టిన చర్యలు ఫలించినా కేసుల సంఖ్య మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. ఢిల్లీలో ఇప్పటిదాకా 1,092 మంది కోలుకున్నారు. 2,364 మంది ఇంకా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

చెన్నై

చెన్నైలో కేసులు పెరగడానికీ కారణం మర్కజ్​కు వెళ్లొచ్చినవాళ్లే. రాష్ట్రంలో 2,323 కేసులు నమోదైతే 40% చెన్నైలోనే ఉన్నాయి. 910  మం ది కరోనా బారిన పడ్డారు. 15 మంది చనిపోయారు. రాష్ట్రంలో చనిపోయినోళ్ల సంఖ్య 27. మొత్తం 214 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 681 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు.

Latest Updates