‘హంగ్​’లలో ఎక్కువ టీఆర్​ఎస్​ చేతికి?

ఎక్స్​ అఫీషియోల అండతో చాలా మున్సిపాలిటీలు కారు ఖాతాలోకి
నిజామాబాద్​ సహా ఐదు కార్పొరేషన్ల పరిస్థితీ అంతే
ఇండిపెండెంట్లకు అధికార పార్టీ ప్రలోభాలు
కొన్నిచోట్ల బీజేపీ, కాం గ్రెస్ కార్పొరేటర్లకు గాలం
మెజారిటీ తగ్గిన స్థా నాల్లో ‌రంగంలోకి ఎమ్మెల్సీలు, ఎంపీలు
నేరేడుచర్ల మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు
కాం గ్రెస్ నుం చి ఎక్స్ అఫీషియో మెం బర్ గా కేవీపీ
పేరు తిరస్కరిం చడంతో ఎంపీ ఉత్తమ్ ఆందోళన

(వెలుగు నెట్​వర్క్) రాష్ట్రవ్యాప్తంగా హంగ్​ రిజల్ట్స్​ వచ్చిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను తమ ఖాతాలో వేసుకునేందుకు అధికార టీఆర్ఎస్​ రంగం సిద్ధం చేసుకుంది. ఎవరికీ మెజార్టీ రాని 23 మున్సిపాలిటీల్లో ఒకట్రెండు మినహా అన్నింటినీ దక్కించుకునేందుకు.. హంగ్​ వచ్చిన రామగుండం, నిజామాబాద్‌‌, మీర్‌‌పేట, బడంగ్‌‌పేట్‌‌, బోడుప్పల్‌‌ కార్పొరేషన్లను చేజిక్కించుకునేందుకు పక్కాగా ప్లాన్​ వేసింది. రిజల్ట్స్​ వచ్చిన మరుక్షణం నుంచే భారీ ఆఫర్లతో ఇండిపెండెంట్లను ప్రలోభపెట్టి క్యాంపులకు తరలించింది. కొన్నిచోట్ల బీజేపీ, కాంగ్రెస్ ఇతర పార్టీల క్యాండిడేట్లకూ వల వేసింది.

భారీగా నగదు, వైస్​చైర్మన్​ పదవులను ఎర వేసింది. మొత్తంగా ఈ ‘ప్రయత్నాల’న్నీ ఫలించడంతో చేజారిపోయాయనుకున్న చైర్​పర్సన్, మేయర్​ పదవులు టీఆర్ఎస్​ ఖాతాలోకి వచ్చి పడనున్నాయి. అప్పటికీ మ్యాజిక్​ మార్క్​ రాదని గుర్తించిన చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఎక్స్​అఫీషియో మెంబర్లుగా నమోదు చేయించింది. నిజామాబాద్ కార్పొరేషన్‍లో అత్యధిక స్థానాలు గెలిచిన బీజేపీని దెబ్బతీసేందుకు ఎంఐఎంతో జట్టుకట్టిన అధికారపార్టీ, ఒక ఇండిపెండెంట్, ఇద్దరు కాంగ్రెస్​ క్యాండిడేట్లకు ఎరవేయడంతోపాటు ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఎక్స్​అఫీషియో మెంబర్లుగా బరిలోకి దింపింది. ఫలితంగా ఇందూరుపై గులాబీ జెండా ఎగరేసేందుకు అంతా సిద్ధం చేసేసింది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ తరఫున ఎక్స్​అఫీషియో మెంబర్​గా నమోదు చేసుకున్న కేవీపీ పేరును ఆఫీసర్లు తిరస్కరించడంతో ఇక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక రెండు మున్సిపాలిటీల్లో తమవారిని రెబెల్స్​గా నిలబెట్టి, మెజారిటీ సీట్లు సాధించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. తన బలగాన్ని పార్టీకే అంకితం చేద్దామని భావించినా టీఆర్ఎస్​ నాయకత్వం ఆయనను దూరంపెట్టింది. ఇండిపెండెంట్లు, మజ్లిస్, ఎక్స్ అఫీషియో మెంబర్ల బలంతో కొల్లాపూర్, అయిజ మున్సిపాలిటీలను కైవసం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

నేరేడుచర్లలో నాటకీయ పరిణామాలు

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని15 వార్డుల్లో కాంగ్రెస్​7, టీఆర్ఎస్​ 7 గెలుచుకున్నాయి. ఒక వార్డులో సీపీఎం గెలుపొందింది. సీపీఎం కాంగ్రెస్​కు మద్దతిస్తోంది. లెక్కప్రకారం ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్​కే దక్కాలి. ఎందుకైనా మంచిదని ఎంపీలు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు ఇక్కడ ఎక్స్‌‌ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కానీ ఈ మున్సిపాలిటీపై కన్నేసిన టీఆర్ఎస్.. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, హుజూర్​నగర్​ ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్లను ఎక్స్​అఫీషియో మెంబర్లుగా నమోదు చేసింది. అయితే మున్సిపల్​ ఆఫీసర్లు రిలీజ్​ చేసిన మెంబర్ల లిస్టులో కేవీపీ పేరు కనిపించలేదు. తెలంగాణ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా గెలిచిన కేవీపీ పేరు ఎందుకు తొలగించారో చెప్పాలంటూ ఎంపీ ఉత్తమ్​ఆఫీసర్లను నిలదీశారు. దీనిపై 2014లో రిలీజైన గెజిట్​ను తీసుకొని వెళ్లారు. కానీ ఆఫీసర్లు టైం అయిపోయిందంటూ రిజెక్ట్​ చేశారు. కలెక్టర్​కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అందుబాటులోకి రాలేదు. దీంతో ఉత్తమ్​సూర్యాపేట క్యాంపు ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.

హంగ్​ మున్సిపాలిటీల్లో అదే తీరు

మంచిర్యాల జిల్లా నస్పూర్​లో 25 వార్డులకుగాను టీఆర్ఎస్ 10, కాంగ్రెస్ 6, బీజేపీ 3, సీపీఐ 1, ఏఐఎఫ్​బీ 1, ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 13 కాగా.. టీఆర్ఎస్ కు మూడు సీట్లు తక్కువ పడ్డాయి. ముందే ఊహించిన టీఆర్ఎస్​ లీడర్లు కౌంటింగ్ కేంద్రం దగ్గరే మకాం వేసి, ఇండిపెండెంట్లను హైదరాబాద్ క్యాంపుకు తరలించారు. ఇండిపెండెంట్లలో తోట శ్రీనివాస్ వైస్ చైర్మన్ పోస్టును డిమాండ్ చేస్తున్నారు. కానీ పోలింగ్​కు ముందే టీఆర్ఎస్ నేతలు వంగ తిరుపతి పేరు ప్రకటించారు. ఇద్దరు చెరో రెండున్నరేళ్లు వైస్ చైర్మన్​గా కొనసాగేందుకు ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఇండిపెండెంట్లలో ఎవరు సపోర్ట్ చేయకున్నా ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్ఎస్ గట్టెక్కే చాన్సుంది.

భువనగిరి మున్సిపాలిటీలో 35వార్డులుండగా.. టీఆర్ఎస్​15, కాంగ్రెస్ 11, బీజేపీ 07, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. టీఆర్ఎస్​ ఇద్దరు ఇండిపెండెంట్లను క్యాంపునకు తరలించింది. వారికి తలో రూ.60 లక్షలు ఇస్తామని ఆఫర్​ చేసినా.. వైస్ చైర్మన్ పదవి కావాలని పట్టుపడుతున్నట్టు చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

కామారెడ్డిలో 49 వార్డులకుగాను టీఆర్ఎస్ 23 గెలిచింది. ఆరుగురు ఇండిపెండెంట్లను పార్టీలోకి లాక్కుని.. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో క్యాంపు పెట్టారు.

ఖానాపూర్​లో 12 వార్డులుండగా.. టీఆర్ఎస్ 5, కాంగ్రెస్‍ 5, ఒక్కోచోట బీజేపీ, ఇండిపెండెంట్‍ క్యాండిడేట్లు గెలిచారు. ఇండిపెండెంట్, ఓ కాంగ్రెస్ క్యాండిడేట్​ఆదివారం కనిపించకుండా పోయారు. వారిని టీఆర్‍ఎస్​ లీడర్లు క్యాంపుకు తరలించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే రేఖానాయక్​ ఇక్కడ ఎక్స్​అఫీషియో మెంబర్​గా నమోదు చేసుకున్నారు.

జనగామలోని 30 వార్డులకుగాను టీఆర్ఎస్​కు 13, కాంగ్రెస్ 10, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3 చోట్ల గెలిచారు. మ్యాజిక్ ఫిగర్16 కాగా.. ముగ్గురు ఇండిపెండెంట్లను టీఆర్ఎస్​ లాగేసింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎక్స్​అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

చౌటుప్పల్ లో 20 సీట్లుండగా.. టీఆర్ఎస్​ 8, కాంగ్రెస్  5, బీజేపీ 3, సీపీఎం 3, ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నమోదు చేసుకున్నారు. అయితే టీఆర్ఎస్ లీడర్లు ముగ్గురు సీపీఎం క్యాండిడేట్లను తమ వైపు లాగారని, వైస్ చైర్మన్​ పదవితో పాటు ఒక్కొక్కరికి రూ. కోటి ఆఫర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.

-యాదగిరిగుట్టలో12 సీట్లు ఉండగా.. టీఆర్ఎస్​ 4, కాంగ్రెస్ 4, సీపీఐ 1, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. టీఆర్ఎస్ ఒక​ఇండిపెండెంట్​కు రూ. కోటి, ఒక కారు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని శిబిరంలో చేర్చుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ శిబిరంలో ఒక సీపీఐ, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ గా ఎమ్మెల్యే గొంగిడి సునీత పేరు నమోదు చేసుకున్నారు. ఇండిపెండెంట్లను తమ వైపు లాగేందుకు టీఆర్ఎస్​ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

భూత్పూర్ లోని 10 వార్డుల్లో టీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 2 గెలుచుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ సభ్యులను బీజేపీ నాయకులు క్యాంపునకు తరలించారు. అయితే ఇక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి ఎక్స్​అఫీషియో మెంబర్లుగా నమోదు చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్​ బలం ఏడుకు చేరింది.

-జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో 20 వార్డులకు టీఆర్ఎస్​ 6, ఫార్వర్డ్ బ్లాక్ (ఎంపీపీ తిరుమల్ రెడ్డి వర్గం) 10, కాంగ్రెస్ 4 వార్డులు దక్కించుకున్నాయి. తిరుమల్​రెడ్డి వర్గానికి ఎలాగైనా చెక్​పెట్టాలని భావిస్తున్న టీఆర్ఎస్​ లీడర్లు.. కాంగ్రెస్ కౌన్సిలర్లతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్​కు చైర్మన్, కాంగ్రెస్​వారికి వైస్ చైర్మన్ ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎక్స్​అఫీషియో సభ్యులుగా ఓటేయాలని నిర్ణయించారు.

కల్వకుర్తిలోని 22 వార్డుల్లో టీఆర్ఎస్ 10 చోట్ల గెలిచింది. నలుగురు రెబెల్స్ తిరిగి టీఆర్ఎస్​లో చేరడంతో పీఠం ఆ పార్టీకే దక్కనుంది. కోస్గిలో 16 వార్డుల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్​ చెరో ఏడు చోట్ల, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. టీఆర్ఎస్​ ఓ ఇండిపెండెంట్​ను శిబిరానికి తరలించింది. ఎక్స్​అఫీషియోతో పీఠం దక్కే చాన్స్​ ఉంది. నారాయణపేటలో 24 వార్డులుండగా టీఆర్ఎస్​కు 10, బీజేపీకి9, కాంగ్రెస్​కు 2, ఎంఐఎంకు ఒకటి వచ్చాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. ప్రస్తుతం అధికారపార్టీ శిబిరంలో ఎంఐఎం సభ్యుడు, ఇద్దరు ఇండిపెండెంట్లు కలిపి 13 మంది ఉన్నారు. ఎమ్మెల్యే రాజేందర్​రెడ్డి ఎక్స్​అఫీషియోగా ఓటేయనున్నారు.

వనపర్తి జిల్లా అమరచింతలోని 10 వార్డుల్లో టీఆర్ఎస్ 3, కాంగ్రెస్​1, బీజేపీ 1, సీపీఎం 2 దక్కించుకున్నాయి. ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. సీపీఎం, ఇండిపెండెంట్​క్యాండిడేట్లను అధికార పార్టీ క్యాంప్​కు తరలించింది. వైస్​ చైర్మన్ పదవి సీపీఎంకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక, హుస్నాబాద్​ మున్సిపాలిటీల్లో 20 వార్డుల చొప్పున ఉండగా.. టీఆర్ఎస్​ 9 చొప్పున గెలుచుకుంది. దుబ్బాకలో ఆరుగురు ఇండిపెండెంట్లకు, హుస్నాబాద్​లో ముగ్గురు ఇండిపెండెంట్లకు వల వేసి, క్యాంపులకు తరలించింది. దుబ్బాకలో ఒక ఇండిపెండెంట్​కు వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ పదవి ఇవ్వడానికి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ రెండు మున్సిపాలిటీలు ఇక టీఆర్ఎస్​ ఖాతాలో పడే చాన్స్​ కనిపిస్తోంది.

నల్గొండ ఎవరిదో..

నల్గొండ మున్సిపాలిటీలోని 48 వార్డుల్లో  టీఆర్ఎస్, కాంగ్రెస్ 20 చొప్పున దక్కించుకున్నాయి. ఆరు చోట్ల బీజేపీ, ఒక ఇండిపెండెంట్, ఒక ఎంఐఎం క్యాండిడేట్​గెలిచారు. టీఆర్ఎస్​ ఇక్కడ ఐదుగురు ఎమ్మెల్సీలను ఎక్స్​ అఫీషియో మెంబర్లుగా రంగంలోకి దింపింది. లోకల్​ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డితో కలిపితే ఆ పార్టీ సభ్యుల సంఖ్య 26కు పెరుగుతోంది. ఎంఐఎం క్యాండిడేట్​కలిస్తే 27కు చేరుతుంది. ఇక ఉన్న ఒక ఇండిపెండెంట్, బీజేపీ క్యాండిడేట్లు చేరడంతో కాంగ్రెస్​ బలం 27కు చేరింది. దీంతో ఈ మున్సిపాలిటీ ఎవరి ఖాతాలో పడుతుందన్నది టెన్షన్​ రేపుతోంది.

బీజేపీ ఖాతాలో మక్తల్..

మక్తల్​ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో పడే చాన్స్​ కనిపిస్తోంది. ఇక్కడ 16 వార్డులు ఉండగా.. బీజేపీకి 8, టీఆర్ఎస్​కు 5, కాంగ్రెస్​కు 2 సీట్లు వచ్చాయి. ఒక ఇండిపెండెంట్​ గెలిచారు. ఇండిపెండెంట్ ను బీజేపీ క్యాంపుకు తరలించగా.. టీఆర్ఎస్​ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఇక్కడ ఎక్స్​అఫీషియో మెంబర్​గా నమోదు చేసుకున్నారు. ఈ మున్సిపాలిటీ బీజేపీ ఖాతాలో పడడం దాదాపు ఖాయమైంది.

ఎక్స్ అఫీషియో ఓట్లేందంటే ?

రాష్ట్రవ్యాప్తంగా హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలక మండళ్లలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోపాటు ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్​సభ, రాజ్యసభ సభ్యులు కూడా మెంబర్లుగా ఉండొచ్చు. వారినే ఎక్స్ అఫీషియో మెంబర్లుగా పిలుస్తారు. వారికి మేయర్, చైర్ పర్సన్ ఎన్నికల్లో ఓటేసేందుకు హక్కు ఉంటుంది. అయితే సదరు మున్సిపాలిటీ/కార్పొరేషన్ కచ్చితంగా వారి సెగ్మెంట్ పరిధిలోనే ఉండాలి. తమ సెగ్మెంట్ పరిధిలో ఒకటికన్నా ఎక్కువగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉంటే.. ఏదో ఒక చోట మాత్రమే ఎక్స్ అఫీషియో మెం బర్ గా నమోదు చేసుకునే చాన్స్ ఉంటుంది. రాజ్యసభ సభ్యులకు ప్రత్యేకంగా నియోజకవర్గం ఉండదు కాబట్టి.. వారు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఎక్స్ అఫీషియో మెంబర్ గా నమోదు చేసుకోవచ్చు. మ్యా జిక్​ ఫిగర్ కు సరిపడా వార్డులు, డివిజన్లు రాని చోట ఈ ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓట్లు కీలకం అవుతున్నాయి.

see also: ఇండియా గ్రాండ్ విక్టరీ

Latest Updates