పెళ్లి పీటలెక్కాల్సిన మేజర్.. అంతలోనే..

డెహ్రాడూన్: మరికొద్ది రోజుల్లో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడు. కానీ పాక్ ముష్కరుల ఉన్మాదం క్షణాల్లో జీవితాన్ని తలకిందులు చేసింది. మరో వారం పది రోజుల్లో సెలవుపై వెళ్లి అనందంగా గడపాల్సిన మేజర్ చిత్రేశ్ సింగ్ బిస్త్ ను ఐఈడీ బాంబు రూపంలో మృత్యువు కబళించింది. పట్టు వస్త్రాలు కట్టకుని పెళ్లి పీటలెక్కాల్సిన ఆయన భరత మాత సేవలో అమరుడయ్యారు.

ఈ నెల 16న జమ్ము కశ్మీర్ లోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పాక్ ఉగ్రవాదులు పెట్టిన ఐఈడీ బాంబును డిఫ్యూజ్ చేస్తుండగా మేజర్ బిస్త్ ప్రాణాలు కోల్పోయారు. మార్చి 7న ఆయనకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిశ్చయించారు. కానీ అంతలోనే ఈ ఘోరం జరిగిపోయింది.  పెళ్లి కొడుకులా చూస్తామనుకున్న తమ బిడ్డ అమరుడై.. శవపేటికలో ఇంటికి చేరడంతో ఆ తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

సోమవారం ఉదయం ఆర్మీ వాహనంలో బిస్త్ పార్థివ దేహం డెహ్రాడూన్ లోని వారి ఇంటికి చేరింది. అప్పటికే వందలాది ప్రజలు అక్కడికి చేరుకుని ఉన్నారు. అమర్ రహే.. అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ శవ పేటికను ఇంట్లోకి చేర్చారు. కొద్దిసేపటి తర్వాత అంతిమ యాత్ర సాగించారు. భారీగా జనం అశ్రు నయనాలతో ముందుకు సాగారు. అమర్ రహే వీర జవాన్ అంటూ తుది వీడ్కోలు పలికారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ వచ్చి బిస్త్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

Latest Updates