హైదరాబాద్‌లో అక్కడ దెయ్యాలున్నాయట!

హైదరాబాద్ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మహానగరం. ఈ నగరాన్ని ఒకప్పుడు నిజాం ప్రభువులు పాలించిన విషయం తెలిసిందే. నిజాం కాలం నాటి పాలనను పరిశీలిస్తే మనకు కొన్ని భయంకరమైన ప్రదేశాలు గర్తుకువస్తాయి. అవును.. నిజాం పాలనను, ఇప్పటి కొన్ని ప్రదేశాలను పరిశీలిస్తే అది నిజమనే అనిపిస్తుంది. అటువంటి ప్రదేశాలలో గొల్కొండ కోట, కుందన్ బాగ్‌ హాంటెడ్ హౌస్, రామోజీ ఫిల్మ్ సిటీ మొదలైనవి చాలా ముఖ్యమైనవి. ఈ ప్రాంతాలు ఇప్పటికీ ఎవరి వెన్నులోనైనా వణుకును పుట్టించగలవు. దెయ్యాలు తిరుగుతున్నాయన్న అనుమానంతో నగరంలోని ఈ స్థలాలు మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్‌గా మారాయి.

కుందన్‌బాగ్‌.. ఈ ఏరియాలో ఓ ఇంట్లో ఒక మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివసించేది. వారు ముగ్గురు రాత్రివేళ కొవ్వత్తులు పట్టుకొని ఆ ఇంటి పరిసరాలలో తిరిగేవారు. వారి ఇంటి గేటు వద్ద రక్తంతో నిండిన బాటిల్‌ను వేలాడదీసేవారు. దాంతో చుట్టుపక్కల వాళ్లు ఆ ఇంటికి దూరంగా ఉంటూ.. వారితో మాట్లాడేవారు కాదు. ఓ రోజు ఒక దొంగ ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ అతను కుళ్లిన స్థితిలో ఉన్న మూడు మృతదేహాలను చూశాడు. ఆ దొంగ పోలీసులకు ఇచ్చిన సమాచారంతో.. పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. ఆ ముగ్గురూ చనిపోయి ఆరు నెలలకు పైనే అయినట్లు పోలీసులు గుర్తించారు. అప్పట్లో ఈ ఇళ్లు నగరంలో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా, హైదరాబాద్‌లోని భయానక ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది.

రామోజీ ఫిల్మ్ సిటీ.. దీనికి దేశవ్యాప్తంగా ఒక పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. సినిమా షూటింగ్‌ల కోసం దేశంలోని పలు ప్రాంతాల నుంచి చాలా మంది నటీనటులు వస్తుంటారు. షూటింగ్ కోసం రెడీ అవుతున్నప్పుడు అద్దంలో వింత ఆకారాలను చూసినట్లు చాలా మంది నటీనటులు చెప్తుంటారు. షూటింగ్‌లో పనిచేసే వాళ్లు ఎన్నోసార్లు పైనుంచి కిందపడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిజాం కాలంలో యుద్ధాలలో చనిపోయిన వారు ఆత్మలుగా మారి ఇక్కడ తిరుగుతున్నట్లు చాలా మంది అంటుంటారు. అందుకే ఇక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డులు చీకటి పడిందంటే చాలు.. చాలా జాగ్రత్తగా ఉంటారు.

2012లో జరిగిన ఆత్మహత్యల కారణంగా.. రవీంద్రనగర్‌ హైదరాబాద్‌లోని హాంటెడ్ ప్రదేశాల జాబితాలో చేరింది. చనిపోయిన వారు దెయ్యాలుగా తిరుగుతున్నారన్న అనుమానంతో చాలామంది ఇక్కడనుంచి ఇళ్లు వదిలి వెళ్లిపోయారు. దాంతో ఆ ఏరియా వార్తలలోకి కూడా ఎక్కింది. అక్కడ వదిలివేయబడ్డ ఇళ్లపై ఇప్పటికీ కొన్ని గుర్తులు ఉన్నాయి. అందువల్ల ఈ ప్రాంతం దెయ్యం కథలకు అడ్డాగా మారింది.

గోల్కొండ కోట భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటిగా ప్రసిద్దికెక్కింది. కొన్ని ఏళ్ల పాటు వివిధ రాజవంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి. అందులో కుతుబ్ షా రాజవంశం కూడా ఒకటి. వారి రాజవంశ వేశ్యలలో తారామతి చాలా ప్రముఖురాలు. ఈమె వారికి ఆస్థాన నర్తకిగా కూడా ఉండేది. ఆమె మరణించిన తర్వాత ఆత్మగా మారి కోటలో నృత్యం చేస్తూ తిరుగుతున్నట్లు చాలా మంది చెప్తుంటారు. అప్పుడప్పుడు కోటలో గట్టి గట్టిగా ఏడుపులు కూడా వినబడతాయని అంటుంటారు. అందుకే ఈ కోటలోకి రాత్రివేళ సందర్శనకు అనుమతించరు.

ఇవేకాకుండా… బేగంపేట హాంటెడ్ హౌస్ మరియు శంషాబాద్ విమానాశ్రయాలను కూడా హైదరాబాద్‌లోని హాంటెడ్ ప్రదేశాల జాబితాలోకి చేర్చవచ్చు. ఎందుకంటే ఈ ప్రదేశాలలో చనిపోయిన వారిని ఖననం చేస్తుంటారు. అందువల్ల ఈ ప్రాంతాలలో ఆత్మలు ఎక్కువగా తిరుగుతుంటాయని ప్రజలు నమ్ముతుంటారు.

Latest Updates