ద్రవిడ్‌ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేశారు

న్యూఢిల్లీ: టీమిండియా సక్సెస్‌ఫుల్ కెప్టెన్స్‌లో కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, సౌరవ్ గంగూలీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లి ముందు వరుసలో నిలుస్తారు. అయితే కెప్టెన్సీ అంత సులువు కాదని సీనియర్ క్రికెటర్స్ విశ్లేషిస్తుంటారు. సచిన్‌ టెండూల్కర్ లాంటి దిగ్గజ క్రికెటర్ కూడా కెప్టెన్సీ ఒత్తిడిని తట్టుకోలేక జట్టు పగ్గాల నుంచి తప్పుకున్నాడు. కానీ మరో లెజెండరీ క్రికెటర్, డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ మాత్రం ఒత్తిడి సమయంలోనూ టీమ్ లీడర్‌‌షిప్ భారాన్ని సమర్థంగా మోశాడు. ఇండియాకు 79 వన్డేల్లో ద్రవిడ్ కెప్టెన్సీ వహించగా.. 42 మ్యాచ్‌ల్లో టీమ్ గెలిచింది. విజయాల శాతం 56. అలాగే 25 టెస్టుల్లో డిపెండబుల్ కెప్టెన్సీ వహించగా.. జట్టు 8 విజయాలు, 6 ఓటములు నమోదు చేసింది. ద్రవిడ్ కెప్టెన్సీ గురించి మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ పలు విషయాలు పంచుకున్నాడు.

ద్రవిడ్‌ను ఓ కెప్టెన్‌గా క్రికెట్ ప్రపంచం చాలా తక్కువగా అంచనా వేసిందన్నాడు. ‘ప్రతి కెప్టెన్‌కు ఓ మార్గం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించే సారథులు ఉంటారు. ద్రవిడ్ కూడా అలా వైవిధ్యంగా ఆలోచించే కెప్టెనే. కానీ అతడు ఎప్పుడూ స్పష్టతతో ఉండేవాడు. ఇది నీ రోల్.. నువ్వు ఇలా పని చేయాలి అంటూ ద్రవిడ్ మాతో చెప్పేవాడు. ప్లేయర్లు ప్రతిదీ చేయాలని ద్రవిడ్ భావించేవాడు. అతడు అలాంటి క్రికెటే ఆడాడు. అతడు గ్లవ్స్ వేసుకొని వికెట్ కీపింగ్ చేశాడు. ఓపెనింగ్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉండేవాడు. మూడో స్థానంలో ఆడటానికీ రెడీగా ఉండేవాడు. ద్రవిడ్ ఆ పొజిషన్‌లో ఆడి 10 వేల పైచిలుకు రన్స్ చేశాడు. అతడో గ్రేట్ టీమ్ ప్లేయర్. అతడి కెప్టెన్సీ స్టయిల్ కూడా అలాగే ఉండేది’ అని పఠాన్ చెప్పాడు.