దంపతులను కలిపిన MPTC టికెట్

ఐదేళ్లుగా మనస్పర్థలతో విడిపోయిన ఓ దంపతులను MPTC టికెట్ కలిపింది. వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన దంపతుల కథ వింటే.. రాజకీయాలు ఇలా కూడా మేలు చేస్తాయా అనిపించక మానదు.

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని.. రామడుగు మండలం కోరటపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మన్, కవిత దంపతులు గత ఐదేళ్లుగా మనస్ఫర్థలతో విడిపోయారు. విడాకులు తీసుకోవాలని డిసైడై కోర్టు మెట్లెక్కారు. ఈ కేసు పెండింగ్ లో ఉంది. అయితే ఇంతలోనే మండల పరిషత్ ఎన్నికలొచ్చాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడైన లక్ష్మన్.. కోరటపల్లి గ్రామ పరిధిలోని మోత ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో.. ఆ టికెట్ తన తల్లికి కావాలని లక్ష్మన్ టీఆర్ఎస్ అధినాయత్వాన్ని సంప్రదించాడు. ఇదే ఎంపీటీసీ టీఆర్ఎస్ టికెట్ కోసం మరికొంత మంది కూడా ధరఖాస్తు చేసుకున్నారు.

అయితే లక్ష్మన్, కవిత దంపతులు గొడవలతో విడిపోయారని తెలుసుకున్న టీఆర్ఎస్ నాయకులు.. లక్ష్మన్ ను ప్రశ్నించారు. దీనికి లక్ష్మన్ కూడా ఉన్నదున్నట్లు నాయకలకు వివరించాడు. తన భార్యకు, తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని.. విడాకుల కేసు పెండింగ్ లో ఉందని.. తన తల్లికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని చెప్పాడు. ఆ దంపతులు విడిపోవడానికి గల కారణాలు చిన్నగా కనిపించడంతో.. తన భార్యను కాపురానికి తీసుకుని వస్తే ఆమెకే టికెట్ ఇస్తామన్నారు.. టీఆర్ఎస్ పెద్దలు.

చేసేదిలేక భార్య తరపు బంధువులతో మాట్లాడి సమస్యపై రాజీకి వచ్చారు లక్ష్మణ్.. భార్య కవిత కూడా కాపురానికి రావడానికి ఓకే చెప్పింది. దంపతుల సమస్య పరిష్కారం కావడంతో.. టీఆర్ఎస్ మోతే గ్రామ ఎంపీటీసీ టికెట్ ఆమెకే కేటాయించారు. ఈ దంపతులు కూడా తాము ఒకటవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఈ విధంగా లక్ష్మణ్, కవిత దంపతులను ఎంపీటీసీ టికెట్ ఒక్కటి చేయడం కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Latest Updates