భర్తను వదిలేసి మేనమామను పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి.. కూతురి మరణానికి కారణమైన తల్లి

హైద‌రాబాద్: కట్టుకున్న భర్తను వదిలేసి త‌న త‌మ్ముణ్ని పెండ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చి క‌న్న‌ కూతురి మరణానికి కారణమైంది ఓ క‌ర్క‌శ‌ తల్లి. న‌గ‌రంలోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ దారుణం జ‌రిగింది. సాయినాథపురానికి చెందిన కత్తి రాములమ్మ కూతురు ఆత్మహత్య కు పాల్పడింది. మొద‌ట ఆమె కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుందేమోనని అంతా అనుకున్నారు. నేరేడ్‌మెట్‌ పోలీసులకు అనుమానం వచ్చి విచారణ జరపగా.. ఒక సూసైడ్ నోట్ లభించడంతో విషయం బయటకు వచ్చింది. మృతురాలి తల్లి రాములమ్మ , ఆమె మేనమామ పుల్లారావు వేధింపులు తట్టుకోలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది.

పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం.. మృతురాలి యొక్క భర్తను చంపేసి మేనమామ అయిన పుల్లారావును వివాహం చేసుకోవాలని నిందితులు ఇద్దరు కలిసి మృతురాలిపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె భర్తను చంపడానికి పొలాలకు వాడే పురుగులమందును కూడా అందించారు. అమాయకుడైన భర్తను చంపడం ఇష్టం లేక, వీరి ఒత్తిడి తట్టుకోలేక చివరకు అదే పురుగుల మందును తాగి రాముల‌మ్మ కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. తన ఆత్మహత్య కు తన అమ్మ మరియు మేనమామే కారణమంటూ సూసైడ్ నోట్ వ్రాసి మరీ చనిపోయింది. పోలీసులు నిందితులను ఇద్దరిని రిమాండ్ కు తరలించారు.

Latest Updates