కుమారుడిని చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి

11 నెలల పసిబిడ్డను చంపి ఆత్మహత్య చేసుకుంది ఓ మహిళ. ఈ దారుణమైన ఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. దౌల్తాబాద్ మండలం కుదురుమల్ల గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాలుగేళ్ల క్రితం తాండూరుకు చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే.. గొడవల కారణంగా ఆరు నెలలకే ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకున్న  శ్రీనివాస్ ఓ బట్టల షాపులో పనికి కుదిరాడు. అక్కడ పని చేస్తుండగా మద్దూరుకు చెందిన మల్లికతో (25) ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో 2017లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి 11 నెలల కుమారుడు సాత్విక్ ఉన్నాడు.

హైదరాబాద్ లో కరోనా వైరస్ భయపెడుతుండడంతో గత నెలలో భార్యాభర్తలు ఇద్దరూ స్వగ్రామం కుదురుమల్లకు చేరుకున్నారు. నిన్న(శనివారం) ఉదయం సాత్విక్‌కు ఆరోగ్యం బాగాలేకపోవడంతో కోస్గిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించి తీసుకొచ్చారు. మధ్యాహ్నం భోజనాల తర్వాత కుటుంబ సభ్యులు బయటకు వెళ్లగా, మల్లిక తన కుమారుడిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు ఉరివేసుకుని మల్లిక కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించిన పోలీసులు…. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Latest Updates