నా కొడుకు చంపేస్తాడు.. కాపాడండి

నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లినే కనికరం లేకుండా కొడుతున్నాడా దుర్మార్గుడు. ఆలన పాలన చూసి ఓ జీవితాన్ని ఇచ్చిన అమ్మనే ఆస్తి కోసం హింసిస్తున్నాడు. తాను ప్రాణం పోసిన కొడుకు కిరాతకంగా తయారవడంతో మరో దారిలేక ప్రాణ హాని ఉందంటూ రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది ఆ మాతృమూర్తి.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం సనిపెల్లి గ్రామానికి చెందిన జయమ్మ (65) తన కొడుకు నుంచి ప్రాణ హాని ఉందని హచ్చార్సీని ఆశ్రయించింది. తన పేరుపై ఉన్న ఆరు ఎకరాల భూమిని చిన్న కొడుకు మోసం చేసి రాయించుకొని దాడి చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది జయ్యమ్మ. తనకు ఫించన్ ఇప్పించడం కోసం అని చెప్పి పొలం రిజిస్ట్రేషన్‌కు సంతకాలు పెట్టించుకున్నాడని తెలిపింది. తర్వాత విషయం తెలిసి అడిగితే రాయితో కొట్టి చంపబోయాడని కన్నీరు పెట్టుకుందామె.

కాపాడాలంటూ అనంతగిరి పోలీసులకు ఆశ్రయిస్తే వాళ్లు నోటికొచ్చినట్లు తిడుతూ,  రివర్స్‌లో తనపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని చెప్పింది జయ్యమ్మ. పోలీసులు కూడా తన కొడుకుతో కలిసి పోయారని ఆవేదన వ్యక్తం చేసింది. ముసలి వయసులో మంచిగా చూసుకోవాల్సిన కొడుకే చంపేసేలా ఉన్నాడంటూ కంటతడి పెట్టుకుంది. తనకు పోలీసులు, కొడుకు నుంచి రక్షణ కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌ను వేడుకుంది.

Latest Updates