కత్తితో దారుణంగా పొడిచింది : కూతుర్ని చంపి.. తల్లి సూసైడ్

కొత్తకోట: అల్లారు ముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్నే పొడిచి చంపింది ఓ తల్లి. కూతురు చనిపోయాక ఆమె కూడా సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన  వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెంలో జరిగింది. కొత్తకోట గ్రామానికి చెందిన నిర్మల (35) భర్త నరసింహ రెండేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె అరేపల్లిలోని పుట్టింట్లోనే ఉంటోంది. ఈనెల 6న ఉగాది పండుగ కోసం కుమార్తె సింధు(8)తో పాటు పాలెంలోని అత్తగారింటికి వెళ్లింది. ఆదివారం అర్ధరాత్రి ఆమె కుమార్తె సింధును కత్తితో పొడిచి హత్య చేసింది. కుమార్తె మరణించిందని నిర్ధరించుకున్న తర్వాత నిర్మల పురుగుమందు తాగింది.

సోమవారం తెల్లవారుజామున గుర్తించిన కుటుంబసభ్యులు కొన ఊపిరితో ఉన్న నిర్మలను చికిత్స కోసం వనపర్తి జిల్లా హస్పిటల్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ ఉదయం మృతిచెందింది. కుమార్తె హత్యకు, నిర్మల ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని సీఐ వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే..భర్త చనిపోయాక నిర్మలకు కుటుంబపోషణ కష్టంగా మారిందని..కష్టం భరించలేకనే తన కూతురు ఎవ్వరికీ బారం కాకూడదని నిర్మల ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు గ్రామస్థులు.

Latest Updates