కొడుకు తాగుతున్నాడని.. చంపి ముక్కలు చేసిన తల్లి

ఏ తల్లి అయినా సరే కొడుకు ఎలాంటి వాడైనా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. కానీ, కొడుకు ప్రవర్తనతో విసుగుచెందిన ఓ తల్లి.. నవమాసాలు మోసి, కని, పెంచిన కొడుకును చంపి ముక్కలు చేసింది. ఈ ఘోరమైన ఘటన తమిళనాడులోని కుంబమ్‌ సమీపంలో జరిగింది.

విఘ్నేశ్వరన్ అనే 20 ఏళ్ల యువకుడు ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మత్తు పదార్థాలకు బానిసై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించేవాడు. చుట్టుపక్కల వాళ్ల ముందు తాగి తల్లిని ఇబ్బంది పెట్టేవాడు. ఒకసారి ఆఫీసుకు కూడా తాగి వెళ్లి క్రమశిక్షణా చర్యలకు గురయ్యాడు. అంతేకాకుండా విఘ్నేశ్వరన్‌పై దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. వీటన్నింటితో విసుగుచెందిన అతని తల్లి విఘ్నేశ్వరన్‌‌ను చంపాలని నిర్ణయించుకుంది. ఆదివారం బయటకెళ్లి ఇంటికొచ్చిన కొడుకుకు విషం కలిపిన ఆహారం పెట్టింది. అది తిన్న విఘ్నేశ్వరన్ కాసేపటి తర్వాత చనిపోయాడని నిర్ధారించుకున్న తల్లి.. కత్తితో అతని తలను మొండెం నుంచి వేరుచేసింది. అంతేకాకుండా.. అతని శరీరాన్ని ముక్కలుముక్కలుగా చేసింది. ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి సహాయంతో విఘ్నేశ్వరన్ మృతదేహాన్ని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేసింది. ఆ దృశ్యాలన్నీ సీసీ టీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఒక చెత్తకుప్ప దగ్గర శరీర అవయవాలు చూసిన వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఆ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజీ ద్వారా అక్కడ ఒక పెద్ద కవర్ పడేసిన ఆమెను పోలీసులు కనిపెట్టారు. ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా.. కొడుకు ప్రవర్తనతో విసుగుచెంది తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది. అయితే విఘ్నేశ్వరన్ మృతదేహాన్ని పడేయాడానికి ఆమెకు సహకరించింది ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates