పిల్లల కోసం పాముతో ఉడుత ఫైట్ : వైరల్ వీడియో

ఈ లోకంలో తల్లి ప్రేమ అనేది చాలా విలువైనది. ఎలాంటి కల్మషం లేని ఆ ప్రేమ బిడ్డల బాగు కోసం తాపత్రయపడుతుంది. ఏదైనా ఆపద ఎదురైన సమయంలో తన ప్రాణాలకు తెగించి బిడ్డలను కాపాడుకుంటుందా తల్లి ప్రేమ. ఈ ప్రేమ మనుషులకి మాత్రమే అతీతం కాదు. సృష్టి లోని ప్రతీ జీవరాశి కూడా తన పిల్లల జోలికి వస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ పోరాడుతోంది. ఇందుకు సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తన పిల్లలను రక్షించడానికి ఓ తల్లి ఉడుత భయంకర విషసర్పంతో పోరాడింది. ఆకలితో ఉన్న ఆ పాము ఉడుత పిల్లలను తినేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తల్లి ఉడుత అందుకు అడ్డుపడింది. పాముకి ఎదురుగా వెళ్లి మరీ తన చిన్న తోకతో ఆ పాముని తరిమికొట్టేందుకు ప్రయత్నించింది. కాటు వేయబోతున్న ఆ పాము నుంచి తప్పించుకుంటూ తన పిల్లల్ని కాపాడుకుంది. ఈ వీడియో క్లిప్ ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి సుశాంత నందా తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

“తల్లి ప్రేమ అనేది అపరిమితమైనది, చివరి శ్వాస వరకు ఎప్పటికీ ఉండేది. తన పిల్లలను రక్షించడానికి ఓ తల్లి ఉడుత.. త్రాచుపాముతో చేసిన పోరాటమే ఇందుకు నిదర్శనం” అని వీడియోతో పాటు ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు.

షేర్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. తల్లి తన పిల్లలపై చూపిన ప్రేమ, పాముకు ఎదురుపడి పోరాడిన ఆ చిన్ని ఉడుత బలాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కొందరు ఉడుత ధైర్యాన్ని ప్రశంసిస్తే.. మరికొందరు భయంకర వీడియో చూసి గగుర్పాటుకు గురయ్యామని కామెంట్లు చేస్తున్నారు.

Latest Updates