అమ్మకానికి ఒకరు.. నడిరోడ్డుపై ఇద్దరు

    మెదక్ జిల్లాలో కొడుకును అమ్మేందుకు తల్లి యత్నం

    వికారాబాద్​, కల్వకుర్తిలో బిడ్డలను వదిలేసిన్రు

పెద్దశంకరంపేట/కల్వకుర్తి/వికారాబాద్, వెలుగు: తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్నారు.. బయటికొచ్చి రోజులైనా కాలేదు.. తల్లి పొత్తిళ్ల నుంచి ప్రపంచాన్ని చూడనేలేదు.. అప్పుడే కన్నవారికి భారమయ్యారు. ఓ తల్లి తన బిడ్డను అమ్మకానికి పెడితే.. మరో తల్లి అందరూ చూస్తుండగానే పసికందును నడిరోడ్డుపై వదిలేసి వెళ్లింది. ఇంకో చిన్నారిని అర్ధరాత్రి వేళ ఆసుపత్రి గేటు ముందు వదిలేసి వెళ్లారు.

ఆర్థిక పరిస్థితులు బాగాలేవంటూ..

మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సుశీల నెలన్నర వయసున్న తన కొడుకును పెద్దశంకరంపేటలో అమ్మకానికి పెట్టింది. తనతోపాటు నాలుగేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురుని వెంట పెట్టుకుని వచ్చింది. తమ కుటుంబం ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, తన భర్త హైదరాబాద్ లోని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత సుశీల, ఆమె పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగించి పాపన్నపేటకు పంపారు. సుశీలకు, ఆమె కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇస్తామని ఐసీడీఎస్ సూపర్ వైజర్ సంధ్య తెలిపారు.

ఆసుపత్రి ముందు ఆడబిడ్డ..

నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్నూల్‌‌‌‌‌‌‌‌ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రి ముందు శనివారం అర్ధరాత్రి రెండు వారాల వయసున్న ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. చిన్నారిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. తర్వాత పాపను మహబూబ్​నగర్ శిశువిహార్​కు తరలించారు.

రైల్వే బ్రిడ్జి దగ్గర చిన్నారి..

వికారాబాద్​లో రైల్వే బ్రిడ్జి పక్కన ఆదివారం మధ్యాహ్నం ఓ చిన్నారిని వదిలేసి వెళ్లిందో తల్లి. అందరూ చూస్తుండగానే మగ పిల్లాడిని ఉంచి వెళ్లిపోయింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వికారాబాద్ ఎస్సై లక్ష్మయ్య అక్కడికి.. చేరుకుని పసికందును ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. శిశువు పరిస్థితి నిలకడగా ఉంది.

Latest Updates