మంచు కొండలో లావా సరస్సు

ఆ పర్వతం చుట్టూ మంచు. పై నుంచి దట్టమైన పొగలు. సరిగా పరిశీలిస్తే అదో అగ్నిపర్వతం. దాని లోపలికి తొంగి చూస్తే ఓ లావా సరస్సు. అందులో వేల డిగ్రీల వేడితో సలసలా కాగుతున్న లావా. దాన్నుండి విడుదలవుతున్న వాయువులే దట్టంగా పర్వతం క్రేటర్ నుంచి బయటకు వస్తున్నాయి. ఆ వేడికి పర్వతంపై మంచు పలుచబడి జావలా తయారైంది. దక్షిణ అమెరికాకు కిందన పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న బ్రిటీష్ ఓవర్ సీస్ టెరిటరీ(బీఓటీ)లో ఉంది. దీనికి ‘మౌంట్ మైఖేల్’ అని పేరు పెట్టారు.

లావా సరస్సులు చాలా అరుదు. ప్రపంచంలో మౌంట్ మైఖేల్ ను పోలిన లావా సరస్సులు ఎనిమిది మాత్రమే ఉన్నాయి. బీఓటీ ద్వీపానికి పర్యాటకుల తాకిడి బాగానే ఉంటుంది. కానీ ఇంతవరకూ మౌంట్ మైఖేల్ ను ఎక్కే ప్రయత్నం చేయలేదు. ఇందుకు కారణం దాన్ని ఎక్కాలనుకుంటే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందేననే భయం. మౌంట్ మైఖేల్ ఎత్తు దాదాపు 990 మీటర్లు. జావలా ఉండే మంచుపై మౌంటెనీరింగ్ సవాలుతో కూడుకున్న పని.

ఒక వేళ ఈ సాహసానికి దిగితే మంచుకు చిన్న చిన్న గాట్లు చేసుకుంటూ పర్వతంపైకి చేరుకోవాలి. అయితే దీని వల్ల పర్వతం లోపలికి పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే మౌంట్ మైఖేల్ చిత్రాలను కూడా స్పేస్ నుంచి తీశారు. లండన్ యూనివర్సిటీ కాలేజి, బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వే కలిసి 2003 నుంచి 2018 వరకూ పర్వతాన్ని పరిశీలించాయి. వాళ్ల సర్వే ప్రకారం పర్వతంలోని లావా సరస్సు 90 నుంచి 215 మీటర్ల వెడల్పు ఉంది. లోపల 1000 డిగ్రీల వరకూ వేడి ఉంటుందని అంచనా వేశారు.

ప్రపంచవ్యాప్తంగా 1500 అగ్నిపర్వతాలు ఉన్నాయి. కానీ నిరంతరం పొగలు చిమ్మే లావా మౌంట్ మైఖేల్ లో మాత్రమే కనిపిస్తుందని సైంటిస్టులు పేర్కొన్నారు. వందల ఏళ్లుగా ఇది బద్దలు కాలేదని చెప్పారు. ఇక్కడ వాయువులు బయటకు నిరంతరం విడుదల అవుతుంటుంది. ఈ కారణంగానే అది పేలి ఉండకపోవచ్చని వివరించారు.

Latest Updates