
అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా, లక్ష్మీపార్వతి కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘రాధాకృష్ణ’. టి.డి.ప్రసాద్ వర్మ దర్శకుడు. పుప్పాల కృష్ణకుమార్ సాగరిక నిర్మాత. ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ని ఆదివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి రిలీజ్ చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ ‘కనుమరుగైపోతున్న చేతి వృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే సోషల్ కాజ్‌తో, నిర్మల్ బొమ్మలు చేసే కళాకారుల ఇబ్బందులే మెయిన్ థీమ్‌గా ఈ సినిమా చేశారు. అందుకు దర్శక నిర్మాతల్ని అభినందిస్తున్నాను. మంచి ఆశయంతో తీసిన సినిమా కాబట్టి ప్రేక్షకులు గొప్ప విజయాన్నిస్తారని ఆశిస్తున్నాను’ అన్నారు. ‘ప్రాచీన కళల్ని కోల్పోతే మన మనుగడనే కోల్పోతాం. మంచి ప్రయత్నంగా తీసిన ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించడం సంతోషంగా ఉంది’ అని లక్ష్మీపార్వతి అన్నారు. హీరో హీరోయిన్స్, దర్శక నిర్మాతలతో పాటు శ్రీనివాసరెడ్డి, నటుడు అలీ, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, కో- ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కానూరి, ఎడిటర్ వెంకట ప్రభు తదితరులు పాల్గొన్నారు.