కరోనాను పట్టించుకోరేంది?

హైదరాబాద్, వెలుగు: కరోనాను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్​ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపడ్డారు. ప్రగతిభవన్​లో తిని, ఫాంహౌజ్ లో పడుకుంటే రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తారని ప్రశ్నించారు. కరోనా నియంత్రణపై ఎలాంటి రివ్యూలు లేవని, టెస్టులు చేయడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో జనాలకు కరోనా సోకితే ఇక చనిపోవడమేనా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కరోనాపై దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పోరాటం చేస్తుంటే, రాష్ట్రంలో మాత్రం సీఎం కేసీఆర్ పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నరు. కరోనాను కట్టడి చేయలేక కేసీఆర్ పారిపోతున్నరు. పైగా రాష్ట్ర ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నరు” అని విమర్శించారు. శుక్రవారం ఎంపీ అర్వింద్​ జూమ్ యాప్ ద్వారా హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. లాక్ డౌన్ రూల్స్​ పాటించడంలో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఆదర్శంగా ఉండాలని, కాని కేసీఆరే పెద్ద సంఖ్యలో జనాన్ని వెంటేసుకొని కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించారని, పైగా మాస్కు లేకుండా ప్రజల ముందుకు రావడం ఏమిటని మండిపడ్డారు. ప్రధాని మోడీ కరోనా కట్టడి కోసం రూ. 450 కోట్లు ఇచ్చారని, అవి రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా ఖర్చు చేసి ఉంటే కరోనా ఈ స్థాయిలో విజృంభించేది కాదని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను కరోనా కట్టడికి ఖర్చు చేయకుండా, వాటిని దారి మళ్లించి పైగా కేంద్రంపైనే విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టించి, వారిని మోసం చేసేందుకే కేంద్రంపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు..

ఈటల రాజీనామా చేయాలి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​కు కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఎంపీ అర్వింద్​ మండిపడ్డారు. ముందు వైద్య ఆరోగ్య శాఖను చక్కగా పని చేసేలా చూసుకోవాలని సూచించారు. ‘‘సర్కార్ దవాఖాన్లలో కనీస వసతులు లేవని, ఆక్సిజన్ అందడం లేదని కరోనా పేషెంట్లు బెడ్లపై నుంచి వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటే ఈటల ఏం చేస్తున్నరు. మంత్రిగా కొనసాగే నైతిక హక్కు ఈటలకు లేదు. రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను, పరిస్థితిని చూసి వైద్య శాఖ మంత్రిగా ఈటల సిగ్గు పడాలని, కాని ఏమాత్రం బుద్ధిలేనట్లుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. వన్ నేషన్ వన్ రేషన్ విధానాన్ని ప్రధాని మోడీ కొనసాగిస్తున్నారని, తెలంగాణలో రేషన్ ఇచ్చేది కూడా కేంద్రమేనని అన్నారు. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

Latest Updates