సీఎం వస్తే.. మిడ్ మానేరు ప్యాకేజీతోనే రావాలి : బండి సంజయ్

సీఎం రోడ్డు మార్గంలో వస్తే సత్తా చూపిస్తాం

ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ ఆక్రమిస్తాం

మిడ్ మానేరు బాధితుల సభలో ఎంపీ బండి సంజయ్

రాజన్నసిరిసిల్ల జిల్లా కొదురుపాకలో జరిగిన మిడ్ మానేరు నిర్వాసితుల సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అక్రమంగా సంపాదించిన సొమ్ములో ఒక్కశాతం ఖర్చు చేస్తే మిడ్ మానేరు కష్టాలు తీరుతాయని అన్నారు. టీఆర్ఎస్ నేతలు అన్ని రకాల అక్రమ దందాలు చేస్తున్నారని ఆరోపించారు. పెద్దోళ్ళు చనిపోతే వెళ్లి ఫొటోలకు పోజులిచ్చే సీఎం .. మిడ్ మానేరు బాధితుల బాధలు పట్టించుకోవడం లేదన్నారు. మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మిడ్ మానేరు నిర్వాసితులు కేసీఆర్ కు బుద్ధి చెప్పారని అన్నారు. ప్రాణ త్యాగం చేసైనా ముంపు గ్రామాలకు అండగా ఉంటామని చెప్పారు బండి సంజయ్.

టీఆర్ఎస్ ఓనర్ షిప్ కోసం కొట్లాడుతున్న ఈటల.. ముంపు గ్రామాలకు అండగా ఉండాలని కోరారు బండి సంజయ్. కేసీఆర్ పునాదులు కదిలిపోతున్నాయని అన్నారు. పాపాలు పోగొట్టుకునేందుకే కేసీఆర్ పూజలు పునస్కారాలు చేస్తున్నారని … నిజంగా భక్తి ఉంటే రాజన్న సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు.  లేదంటే రాజన్న శాపం తప్పదని అన్నారు ఎంపీ.

మిడ్ మానేరు నిర్వాసితులకు న్యాయం కోసం అవసరమైతే ప్రగతి భవన్, ఫాం హౌస్ ఆక్రమిస్తామని చెప్పారు ఎంపీ సంజయ్. చావడానికైనా చంపడానికైనా సిద్ధమనీ.. తమకు పోరాటాలు కొత్త కాదని అన్నారు. మిడ్ మానేరు ప్రజలు ఏం పాపం చేశారని ప్రశ్నించారు. మిడ్ మానేరు నిర్వాసితుల కాలనీల్లో పరిశ్రమలకు రాష్ట్రం ప్రతిపాదన పెడితే కేంద్రం నుంచి అనుమతులు తెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. మిడ్ మానేరు ప్రజల కోసం కేంద్రం తరపున డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం సాయం ఇప్పిస్తానని చెప్పారు. పిట్టకథలతో టీఆర్ఎస్ నేతలు మోసం చేస్తున్నారనీ.. ఛలో ప్రగతి భవన్, ఛలో ఫాం హౌస్ కార్యక్రమంలో బీజేపీ ముందు ఉంటుందని చెప్పారు. కొదురుపాకకు సీఎం వస్తే ప్యాకేజీతోనే రావాలనీ.. హెలికాప్టర్ లో కాదు దమ్ముంటే రోడ్డు మార్గంలో సీఎం వస్తే సత్తా చూపిస్తామని చెప్పారు.

Latest Updates