స్కాములపై  కేసీఆర్,​ కేటీఆర్ సంగతి తేలుస్తా

  • టీఆర్‌‌ఎస్ నేతల అక్రమ దందాలకు శిక్షలేస్తే రాష్ట్రంలో జైళ్లు చాలవు
  • నాకోసం నలుగురు మంత్రులను పెట్టారట… నేనే వారిపై దృష్టి పెడతా
  • కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

వేములవాడ, వెలుగు: రాష్ట్రంలో ప్రాజెక్టులు, పవర్‌‌, గ్రానైట్ స్కాములపై సీఎం కేసీఆర్‌‌, కేటీఆర్‌‌ సంగతి తేలుస్తామని కరీంనగర్‌‌ ఎంపీ బండి సంజయ్‌‌ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గురువారం టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 1500 మంది ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎంపీ మాట్లాడుతూ టీఆర్‌‌ఎస్‌‌ నాయకులు చేస్తున్న అక్రమ దందాలకు వారికి శిక్షలేస్తే రాష్ట్రంలో జైళ్లు సరిపోవన్నారు.

మొన్నటి ఎన్నికల్లో సీఎం నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు నన్ను ఏం చేయలేకపోయారని, ఇప్పుడు నలుగురు మంత్రులు వచ్చి ఏం చేస్తారని… నా సంగతి చూడడం కాదు నేనే వాళ్ల సంగతి చూస్తానని హెచ్చరించారు. కరీంనగర్‌‌లో గ్రానైట్ మాఫియా ఎనిమిది క్వారీల నుండి మూడేండ్లలో రూ.749 కోట్లు అక్రమంగా తవ్వుకున్నట్లు ఆఫీసర్లే తేల్చారన్నారు. గుర్తించనివి వంద క్వారీల వరకున్నాయని.. వీటిలో అక్రమాల విలువ పదివేల కోట్ల రూపాయలు దాటుతుందన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇసుక, గ్రానైట్‌‌, గుట్కా అక్రమ దందాలపై సీబీఐ విచారణ కోరుతామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపింస్తామన్నారు.

కేసీఆర్, కేటీఆర్‌‌ను తిట్టిన తలసాని, ఎర్రబెల్లి లాంటి వారికే పదవులు ఇస్తున్నారన్నారు. రాష్ర్టంలో డెంగీ జ్వరాలతో అందరు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో చొప్పదండి మాజి ఎమ్యేల్యే బోడిగె శోభ, బిజెపి జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఎర్రం మహేశ్‌‌ తదితరులు పాల్గొన్నారు.

Latest Updates