మీకోసం లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు తింటాం: బండి సంజయ్

కరీంనగర్: RTC సమ్మెతో టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందన్నారు బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.  బుధవారం కరీంనగర్ లో ఆర్టీసీ సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అహంకారంతో ఆర్టీసి కార్మికులను అణగదొక్కాలని చూస్తున్నాడన్నారు. నెలరోజుల ముందే సమ్మె నోటీస్ ఇచ్చినా… నోటీసులపై ఎలాంటి స్పందన లేకుండా మిన్నకుండిపోయారన్నారు. నేడు డ్యూటీలోకి రాని ఆర్టీసీ కార్మికుని ఉద్యోగం పోయినట్లే అని చెబుతున్న కేసీఆర్ ను….  సెక్రటేరియట్ కు రాకున్నా సీఎంగా ఎలా గుర్తించాలని ప్రశ్నించారు ఎంపీ.

“కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు.. ఒక్కసారి బస్సు స్టీరింగ్ తిప్పి చూడండి. టైర్ సెక్షన్లో ముక్కుకు గుడ్డ కట్టుకోకుండా కొద్దిసేపు వర్క్ షాపులో ఉండి చూడండి. ఆర్టీసీ డ్రైవర్, కండెక్టర్ ఆరోగ్యాలు పాడవుతున్నా కుటుంబపోషణ కోసం వాళ్లు పడే  కష్టం ఏంటో తెలుస్తుంది.” అని అన్నారు బండి సంజయ్. క్యాన్సర్, లీవర్, గుండె జబ్బులతో ఆర్టీసీ కార్మికులు బాధపడుతున్నారన్నారు.

జగన్ మోహన్ రెడ్డి తో రాత్రి పూట ముచ్చట్లు పెట్టే సీఎం.. అక్కడిలాగా ఇక్కడెందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో  విలీనం చేయటం లేదని ప్రశ్నించారు సంజయ్. ఆర్టీసీ ఆస్తులను కబ్జా చేసి మల్టీ ప్లెక్స్ లు నిర్మించుకునే కుట్రలో భాగంగానే ప్రయివేటు పరం చేయాలని చూస్తున్నాడన్నారు. ఆంధ్రా ప్రయివేటు ట్రావెల్స్ తో కుమ్ముక్కై ఆర్టీసీని ప్రయివేటీకరణకు ప్రయత్నిస్తున్నాడన్నారు. ప్రయివేటు పరం చేయడమంటే అక్రమ దోపిడికీ కుట్ర చేయడమేనని ఆయన అన్నారు. సర్పంచులను, ఉద్యోగులను, ఆర్టీసీ కార్మికులను భయపెట్టాలని చూస్తున్నాడు. ఉద్యోగాలు పోయినా పర్వాలేదంటూ ఆర్టీసీ కార్మికులు పట్టుదలపై ఉండటం గర్వకారణమన్నారు ఎంపీ. మీ ఉద్యమంలో  ముందుంటా.. ఆర్టీసీ కార్మికులంతా ఐక్యంగా ఉండాలని సంజయ్ పిలుపునిచ్చారు.

అనుభవంలేని డ్రైవర్లతో బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు జరగాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు. ప్రమాదాలు జరిగితే ఆ తప్పిదాన్ని ఆర్టీసీ కార్మికులపై నెట్టాలని చూస్తున్నారన్నారు సంజయ్. ఫైళ్లన్నీ మాయం చేసేందుకే సెక్రటేరియట్ మార్పు కుట్ర చేస్తున్నాడని అన్నారు.

ఆర్టీసీ కార్మికుల పట్ల అనుచితంగా మాట్లాడిన తలసాని శ్రీనివాస్ అంతటి మూర్ఖుడు ఎవడూ లేడని సంజయ్ అన్నారు. అధికారంలో ఎవరుంటే వారికి కొమ్ముకాసి మంత్రి పదవులు పొందే తత్వం తలసానిది అని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగలాగా దాక్కొని,  ఇప్పుడు కేసీఆర్ మెప్పు పొందేందుకు ఆర్టీసీ కార్మికులను కించపరిచేలా మాట్లాడుతున్నాడన్నారు. 50 వేల  జీతం ఏ ఆర్టీసీ కార్మికునికి వస్తుందో తలసాని నిరూపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. “లక్షల రూపాయలు అక్రమంగా దోచుకున్నావ్.. బిడ్డా నీ సంగతి చెప్తాం. ఆర్టీసీ కార్మికులు గల్లీల్లో నిన్ను తరిమికొట్టే రోజులొస్తాయి.” అని బండి సంజయ్ హెచ్చరించారు.

అన్ని సంఘాలను చీల్చి సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, యూనియన్లకు అతీతంగా కార్మికులంతా ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు.  ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్టీసీకి మద్ధతునివ్వాలని, లేకుంటే మీకు కూడా ఇదే గతి పట్టడం ఖాయమని చెప్పారు. బీజేపీ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్ధతుగా ఉంటుందన్నారు. ఆర్టీసీకి అండగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు అండగా ఉంటాయన్నారు. త్వరలో బీజేపీ రాష్ట్ర కమిటీ అత్యవసరంగా సమావేశమై కీలక నిర్ణయం తీసుకుంటామని, ఆర్టీసీ జెండా భుజాన వేసుకుని మీ తరపున లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు తింటామని చెప్పారు.

MP Bandi Sanjay expresses solidarity for the RTC strike in Karimnaga

Latest Updates