నాపై దాడి చేయిస్తవా? కేసీఆర్​.. నీ సంగతి తేలుస్తా!

దుబ్బాక నుంచే టీఆర్ఎస్​కు రాజకీయ సమాధి: బండి సంజయ్

కార్యకర్తలను సముదాయించేందుకు వెళ్తే అడ్డుకున్నరు

నా గొంతు పట్టుకుని కారులోకి నెట్టారు

పోలీస్​ కమిషనర్​ పళ్లు కొరుకుతూ రాక్షసంగా ప్రవర్తించారు

సీపీని సస్పెండ్​ చేసి, కేసు పెట్టాలని డిమాండ్

కరీంనగర్​లో దీక్షకు కూర్చున్న సంజయ్​

కరీంనగర్, వెలుగు: టీఆర్ఎస్​ సర్కారు పోలీసు​కమిషనర్ (సీపీ)​తో తనపై చేయించిందని, ఈ విషయంలో సీఎం సంగతి తేలుస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. దుబ్బాక బైఎలక్షన్​లో టీఆర్ఎస్​ ఓటమి భయంతోనే శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎంతగా అణచేయాలని చూస్తే అంతగా రెచ్చిపోయి పనిచేస్తామని స్పష్టం చేశారు. తనపై దాడి చేసిన సీపీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తల పట్ల సర్కారు వ్యవహరిస్తున్న తీరును, తమపై జరిగిన దాడిని తప్పుపడుతూ కరీంనగర్​లోని తన ఆఫీసులో నిరాహార దీక్షకు దిగారు. బీజేపీ నేత, దుబ్బాక క్యాండిడేట్​ రఘునందన్​రావును కలిసేందుకు సిద్దిపేట వెళ్లిన బండి సంజయ్​ను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి కరీంనగర్​కు తరలించారు. అక్కడ సంజయ్​ మీడియాతో మాట్లాడారు. ‘‘రఘునందన్ రావు ఇంట్లో పడుకున్న పసిపాపను కూడా లేపి తనిఖీలు చేశారు. పోలీసులు రాక్షసుల్లా వ్యవహరించారు. మహిళ అని కూడా చూడకుండా రఘునందన్  భార్యను తోసేశారు. సీఎం కేసీఆర్​ ఇంట్లో ఇదే విధంగా చేయగలరా”అని నిలదీశారు. తాము స్వాధీనం చేసుకున్న డబ్బును బీజేపీ కార్యకర్తలు ఎత్తుకుపోయారని చెప్తున్నారని.. అలా జరిగితే సీపీని సస్పెండ్ చేయాలని, డబ్బును కాపాడలేని సీపీ ఎందుకని పేర్కొన్నారు. దుబ్బాకలో ఎలక్షన్​ జరుగుతుంటే.. సిద్దిపేటలో తనిఖీలు ఎందుకని ప్రశ్నించారు. పోలీసులు ఎటువంటి నోటీసులు లేకుండా మఫ్టీలో వచ్చి దాడి చేశారని ఆరోపించారు. కేసీఆర్​ ఫామ్ హౌజ్, ప్రగతి భవన్​ నుంచి దుబ్బాక ఎలక్షన్​కు డబ్బులు వస్తున్నాయని.. పోలీసులకు దమ్ముంటే కేసీఆర్​ ఫామ్ హౌస్ లో కూడా చెక్ చేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. కానీ టీఆర్ఎస్​ ఓటమి భయంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తోందన్నారు.

ఎంపీనని చూడకుండా దాడి చేస్తరా?

టీఆర్ఎస్​ సర్కారు పోలీస్​ కమిషనర్ (సీపీ)​తో తనపై దాడి చేయించిందని సంజయ్​ ఆరోపించారు. ‘‘నన్ను గొంతు పట్టుకుని కారులోకి నెట్టారు. ఆపండి అని అరుస్తున్నా కూడా.. సీపీ పళ్లు కొరుకుతూ నాపట్ల రాక్షసంగా ప్రవర్తించారు. నా కాలు విరిగిపోయేలా ఉందని అరిచినా వినిపించుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఎంపీనని కూడా చూడకుండా నాపై పోలీసులు దాడి చేశారు. దీనిపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా. సీపీ సంగతి, సీఎం సంగతి తేలుస్తా. నాపై దాడికి పాల్పడిన సీపీపై క్రిమినల్ కేసులు పెట్టాలి. సస్పెండ్ చేయాలి” అని డిమాండ్​ చేశారు. నియంత్వత్వ, రజాకార్ల తరహా కేసీఆర్​ పాలనకు దుబ్బాక రిజల్ట్ చరమ గీతం కాబోతోందని.. టీఆర్ఎస్​కు అక్కడే రాజకీయ సమాధి పడుతుందని పేర్కొన్నారు. 2023లో బీజేపీ అధికారానికి దుబ్బాక రిజల్ట్​ నాంది పలుకుతుందన్నారు.

సహనాన్ని పిరికితనంగా చూడొద్దు

సీఎం మోచేతి నీళ్లు తాగే కొన్ని పత్రికలు, చానళ్లు తమ సహనాన్ని పిరికితనంగా చూస్తున్నాయని సంజయ్​ విమర్శించారు. ఈ తీరు సరికాదన్నారు. సీఎం ప్రెస్​మీట్లలో రిపోర్టర్లను బెదిరిస్తున్నా కూడా మేనేజ్​మెంట్లు చేతగానితనంతో చూస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నీట మునిగితే సీఎం బయటకు ఎందుకు రాలేదని రాయలేని దుస్థితిలో కొందరు ఉన్నారని తప్పుపట్టారు.

ఎలక్షన్​ కమిషన్​ స్పందించాలె..

తెలంగాణలో ఎలక్షన్​ కమిషన్​ ఉందా, లేదా అని సంజయ్​ ప్రశ్నించారు. కేవలం కలెక్టర్ ను బదిలీ చేసి చేతులు దులుపుకోవడం సరికాదన్నారు. తనను బలవంతంగా అదుపులోకి తీసుకుని కరీంనగర్ తీసుకుపోతే ప్రమోషన్ వస్తుందని అనుకుంటున్నారా అని పోలీస్​ కమిషనర్​ను నిలదీశారు. ఎంతగా అణచేయాలని చూస్తే ఇంకా రెచ్చిపోయి పనిచేస్తామని స్పష్టం చేశారు.

నా మాటలు తప్పని నిరూపిస్తే ఉరేసుకుంట..

తాము దాడులకు భయపడబోమని, తమ దమ్మేంటో చూపిస్తామని బండి సంజయ్​ పేర్కొన్నారు. అగ్గిపెట్టె నాయకుడి సవాళ్లపై తాను మాట్లాడనంటూ మంత్రి హరీశ్​రావుపై విమర్శలు గుప్పించారు. సీఎం ఎంత సంస్కార హీనుడో, ఆయన కింది వాళ్లు కూడా అలాగే ఉన్నారని ఆరోపించారు. దుబ్బాక నామినేషన్ సందర్భంగా తాను చెప్పిన విషయాలు తప్పు అని సీఎం నిరూపిస్తే.. దుబ్బాక చౌరస్తాలో తాను ఉరేసుకుంటానని, లేదంటే సీఎం ఉరేసుకుంటడా చెప్పాలని సవాల్ విసిరారు.

దీక్షకు దిగిన సంజయ్

బండి సంజయ్​ మీడియాతో మాట్లాడాక నిరాహార దీక్షకు దిగారు. ఎంపీ ఆఫీసు గేటుకు తాళం వేయించుకుని లోపల దీక్ష మొదలుపెట్టారు. సిద్దిపేట పోలీస్​ కమిషనర్​ను సస్పెండ్ చేసి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సంజయ్​కు సంఘీభావం ప్రకటించారు. సిద్దిపేట సీపీని వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. కాగా, పోలీసులు అరెస్టు చేసే టైమ్​లో గాయపడిన బండి సంజయ్​ను ఎంపీ అరవింద్​ పరామర్శించారు.

సంజయ్​కు అమిత్ షా ఫోన్

సిద్దిపేట ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్​షా ఆరా తీశారు. ఈ మేరకు సోమవారం రాత్రి బండి సంజయ్​కు ఫోన్​ చేసి మాట్లాడారు. సిద్దిపేటలో పోలీసుల దాడులు, అక్కడికి వెళ్తున్న బండి సంజయ్‌ను బలవంతంగా అరెస్టు చేసి తరలించడం, ఆయనకు గాయాలవడం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

For More News..

రఘునందన్‌‌‌‌‌‌‌‌ వెహికల్‌‌‌‌‌‌‌‌ 20 సార్లు తనిఖీ

పోలీసులు గులాబీ అంగీలు తొడుక్కున్నరా?

చెరువును పూడ్చి కలెక్టరెట్ నిర్మాణం.. వరదనీటిలో మునక..

ఫ్రెండ్స్​తో కలిసి చెల్లిని గ్యాంగ్​రేప్​ చేసిన అన్న

Latest Updates