‘కేటీఆర్.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు’

నిజామాబాద్ లో మేయర్ కిరీటం ఎంఐఎం కి అప్పచెప్పేందుకు కేసీఆర్ నిర్ణయించారని, ఎట్టి పరిస్థితుల్లో వారికి మేయర్ పీఠాన్ని దక్కనివ్వమని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శుక్రవారం నిజామాబాద్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ కార్పొరేషన్ లోని మైనారిటీ ఏరియాల్లో బీజేపీ వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారన్నారు. నిజామాబాద్ లో మేయర్ పీఠం ఎంఐఎం కి అప్పచెప్తే ప్రజల బతుకులు అధోగతి పాలవుతాయన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో 40 స్థానాలు గెలిచి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని చెప్పారు.

తమ పార్టీ నుంచి ఓ సామాన్యుని మేయర్ చేస్తామని. తాము అధికారంలోకి వస్తే కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తామని, కావాల్సినన్నీ నిధులు తెస్తామని అన్నారు అర్వింద్. కేంద్ర మంత్రులతో మాట్లాడి అధిక నిధులు తెచ్చి కార్పొరేషన్ ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొదటి తీర్మానం నిజామాబాద్ పేరుని ఇందూరు గా మార్చేలా ఫైల్ చేస్తామని అన్నారు. కాబట్లి నగర వాసులు ఆలోచించి.. బిజెపిని గెలిపించాలని కోరారు అర్వింద్ .

భైంసాలో హిందువుల ఇల్లు తగలబడితే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని అర్వింద్ ప్రశ్నించారు. భైంసాలో అరాచకం చేయటానికి కేసీఆర్, పోలీసులు సహకరించారన్నారు. భైంసా ఘటనను ప్రసారం కాకుండా మీడియాని నియంత్రించారన్నారు. భైంసా ఘటనకు నిరసనగా శనివారం నిజామాబాద్ లో దీక్ష నిర్వహిస్తానని చెప్పారు. నిజామాబాద్ లోని హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని.. మైనారిటీలంతా ఒకటైనప్పుడు హిందువులంతా ఒకటి కావటంలో తప్పేముందన్నారు ఎంపీ.

తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ ని కేటీఆర్, కవిత కలిసి చరిత్ర హీనుణ్ణి చేశారని అర్వింద్ అన్నారు. కేటీఆర్ అహంకారాన్ని ప్రజలు తరిమే రోజు దగ్గరలో ఉందని అన్నారు. ‘కేటీఆర్ ఓ అహంకారి, సన్నాసి.  అందుకే మోడీ, షా ‘లను విమర్శిస్తున్నాడని ఆయన అన్నారు. రాజకీయ పరిజ్ఞానం లేని కేటీఆర్.. ఎంఐఎం తో కలిసి హిందువుల మీద దాడులు చేస్తున్నారన్నారు. కేటీఆర్ ఇకపై ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. ఎన్.ఆర్.సీ, సి.ఏ.ఏ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమని చెబుతున్న హోం మినిష్టర్ మహమూద్ అలీని జైల్లో వేస్తామని చెప్పారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్రంపై చవకబారు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు అర్వింద్. పేదల ఇళ్ల కోసం ఇచ్చిన నిధులను రాష్ట్రం దుర్వినియోగం చేస్తోందని, నిజామాబాద్ లో ఎవరికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. కేంద్ర నిధులను తప్పు దోవ పట్టిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదని అన్నారు. కనీస అవగాహన లేకుండా మంత్రి ప్రశాంత్ మాట్లాడుతున్నారని, పసుపు రైతులకు మద్దతు ధర కోసం కేంద్ర సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో లేఖ ఇప్పించగలరా? అని ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు అర్వింద్. హిందువుల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్ర మంత్రిగా ప్రశాంత్ రెడ్డి ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. కేసీఆర్ కేవలం ఎంఐఎం కోసమే పని చేస్తున్నారని ఎంపీ అన్నారు.

More News కోర్టుకు హాజరు కాలేనన్న జగన్…

కాంగ్రెస్ పార్టీ హామీలిస్తే.. నెరవేర్చేది ఎవరు?
నిర్భయ దోషులకు మూసుకుపోయిన దారులు

Latest Updates