ఆవులకూ స్వయంవరం.. పశుసంవర్ధక శాఖ ప్రకటన

మధ్యప్రదేశ్‌‌లో ఆవులకూ స్వయంవరం జరగబోతోంది. ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖే దీన్ని ప్రకటించింది. అక్కడ మేలుజాతి ఆవుల సంఖ్యను, పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 16 బ్రీడ్లకు చెందిన 200 మేలు జాతి ఎద్దుల వీర్యాన్ని తీసుకోవడానికి ఇప్పటికే వాటిని బ్రీడింగ్ కేంద్రాలకు (సెంట్రల్‌‌ సీమెన్‌‌ స్టేషన్లు) తీసుకొచ్చింది. ఆ 200 ఎద్దుల చరిత్రతో ఓ డేటాబేస్‌‌ను (సిరే) కూడా సిద్ధం చేసింది. ఆ ఎడ్ల కుటుంబాల చరిత్ర, వాటికి వచ్చిన వ్యాధులు, ఆ ఆవుల తల్లులిచ్చే పాల వివరాలతో లిస్టును రెడీ చేసింది. సీమెన్‌‌ స్టేషన్లకు వచ్చిన ఎద్దుల్లో గిర్, సహివాల్, తర్పర్‌‌కర్, ముర్రా, మాల్వీ, నిమరి రకాలున్నాయి. ఆవుల యజమానులు ఎడ్ల వీర్య కేంద్రాలకు వచ్చి వాటి వివరాలు చూసి తమ ఆవులకు సరైన ఎద్దులతో కలుపుకోవచ్చు.

ప్రస్తుతం రెడీ చేసిన డైరెక్టరీని ప్రతి నెలా అప్‌‌డేట్‌‌ చేస్తారు. ఎద్దులకు సంబంధించిన డేటాను మధ్యప్రదేశ్‌‌ స్టేట్‌‌ లైవ్‌‌స్టాక్‌‌ అండ్‌‌ పౌల్ట్రీ డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ రెడీ చేసిందని పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్పారు. భోపాల్‌‌లో సెంట్రల్‌‌ సీమెన్‌‌ స్టేషన్‌‌ను ఆ కార్పొరేషన్‌‌ నడిపిస్తోందని, దేశంలోని ఏ గ్రేడ్‌‌ సీమెన్‌‌ స్టేషన్లలో ఇదొకటని అన్నారు. ఏడాదికి 28 లక్షల ఫ్రోజెన్‌‌ సీమెన్‌‌ డోసులను స్టేషన్‌‌ ఉత్పత్తి చేస్తోందని, ఆ సంఖ్యను 40 లక్షలకు పెంచాలనుకుంటున్నామని తెలిపారు. మేలుజాతి ఎద్దుల వీర్యాన్ని ఆవులకు ఎక్కించడం ద్వారా ఎక్కువ పాలనిచ్చే ఆవులను పొందగలమని అన్నారు. దేశీ పశువుల జాతుల సంఖ్యను పెంచేందుకు ఇది చాలా ఉపయోగపడుతుందని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి లఖన్‌‌ సింగ్‌‌ చెప్పారు.

 

Latest Updates