మ‌రికాసేప‌ట్లో పెళ్లి.. వ‌ధువు దారుణ హ‌త్య‌

మ‌‌ధ్య‌ప్ర‌దేశ్: మ‌రి కొన్ని గంట‌ల్లో పెళ్లి పీట‌లెక్కాల్సిన నూత‌న వ‌ధువు.. ఓ దుర్మార్గుడి చేతిలో దారుణ హ‌త్య‌కు గురైంది. ఈ దారుణం మ‌‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ర‌త్లామ్ జిల్లాలో చోటుచేసుకుంది. ర‌త్లామ్ జిల్లాలోని జ‌వోరా గ్రామానికి చెందిన యువతికి ఆదివారం సాయంత్రం న‌గ‌డాకి చెందిన ఓ వ్య‌క్తితో వివాహం జరగాల్సి ఉంది. అయితే పెళ్లి కోసం ముస్తాబ‌వ‌డానికి మధ్యాహ్న సమయంలో తన చెల్లెలును వెంట తీసుకుని సమీపంలోని బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లింది. ఆ స‌మ‌యంలో ఓ అగంత‌కుడు క‌త్తితో బ్యూటీ పార్ల‌ర్‌లో చొర‌బడి.. ఆ యువతి గొంతుకోసి పారిపోయాడు. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న ఆ యువతిని కాపా‌డేందుకు ఆమె చెల్లెలు స్థానికుల సహాయంతో సమీప ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. డాక్ట‌ర్లు మార్గ‌మ‌ధ్యంలో ఆ యువ‌తి మృతి చెందిన‌ట్టు తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప‌రారీలో ఉన్న నిందితుడి కోసం పత్యేక బృందాలతో గాలిస్తున్నామని రత్లామ్ ఎస్పీ గౌరవ్ తివారి తెలిపారు. ఘ‌ట‌నా ప్రాంతం నుంచి సేక‌రించిన కొన్ని క్లూస్ ఆధారంగా ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు ఆయ‌న‌ తెలిపారు.

Latest Updates