రూ. లక్ష రుణమాఫి హామీ కేసీఆర్ ఇంకా అమలు చేయలేదు

నిద్రాహారాలు మాని ఢిల్లీలో అన్నదాతలు చేస్తున్న పోరాటం అభినందనీయమన్నారు కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి. బీజేపీకి జిహెచ్ఎంసి ఎన్నికల మీదున్న శ్రద్ధ రైతుల పోరాటంపై లేదన్నారు. దేశ రాజధానిలో పదిరోజులుగా రైతులు చేస్తోన్న పోరాటంపై బీజేపీ అగ్రనాయకత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్లో విశ్వసనీయత కోల్పోయాయని..మోడీ తెచ్చిన చట్టాలు రైతుల పాలిట ఉరితాళ్లలాగే ఉన్నాయన్నారు. అంబానీ, అదానీల కోసమే మోడీ కొత్త చట్టాలని..మోడీ చట్టాలను విపక్షాలు, సొంత పార్టీ సీఎంలు, ఎన్డీఏ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు. దాల్ మే కుచ్ కాలా హై అన్నట్టు… ఇవి నల్ల చట్టాలన్న విషయం రైతులకు తెలిసిందన్నారు.

తెలంగాణ ఆవిర్భావం నుంచి నేటి వరకు రోజున సగటున ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. జాతీయ నేరపరిశోధనా విభాగం (NCRB) లెక్కల ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణ స్వరాష్ట్రంలో 6,380 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు 468 రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారన్న రేవంత్.. 2018 ఎన్నికల లక్ష రుణమాఫి హామీ కేసీఆర్ ఇంకా అమలు చేయలేదన్నారు. కౌలు రైతులు రైతులే కాదని కేసిఆర్ తేల్చిపారేశారని..ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో 80 శాతం కౌలు, చిన్న, సన్నకారు రైతులేనన్నారు. ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్ విజయవంతం చేయాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొని, జై కిసాన్ నినాదాలు చేయాలని పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

Latest Updates