సచివాలయ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా.. ప్రకాశ్ జవదేకర్ పట్టించుకోలేదు

హైదరాబాద్: శ్రీశైలం పవర్ ప్రాజెక్ట్‌ ఘటనపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ కాలుష్యం వల్ల ప్రెగ్నెన్సీ మహిళలకు అబార్షన్లు అవుతున్నాయని రేవంత్ చెప్పారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ జవదేకర్‌‌కు తాను ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని ఫైర్ అయ్యారు. సచివాలయం కూల్చివేత, పునర్నిర్మాణంపై రేవంత్ కామెంట్స్ చేశారు.

‘హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కట్టకూడదని సుప్రీం కోర్టు విస్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. అందుకే అక్కడ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సమాధి ఉన్నా శాశ్వత కట్టడం కట్టలేదు. ఆ పక్కనే కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్మశాన వాటిక ఉన్నా శాశ్వత కట్టడాలు నిర్మించలేదు. ఆ పక్కనే ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్ కూడా పర్మినెంట్ స్ట్రక్చర్ కాదు. నట్టులు, బోల్టులు తెచ్చి బిగించిందే. దానిపైనా విచారణ కొనసాగుతోంది. హుస్సేన్ సాగర్ పరివాహక ప్రాంతంలో పాత భవనాలను కూలగొట్టాలన్నా, అదే స్థానంలో కొత్తగా దేన్నయినా నిర్మించాలన్నా కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి తప్పనిసరి. దీని ప్రకారం సచివాలయాన్ని కూలగొట్టడానికి కేంద్ర అనుమతులు తీసుకోవాలి. అనుమతులు లేకుండానే సచివాలయాన్ని కూలగొట్టి.. పర్మిషన్స్ లేకుండానే కొత్త భవన పనులు మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రకాశ్ జవదేకర్‌‌కు సమర్పించా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నుంచి కూడా వెంటనే కౌంటర్ ఫైల్ చేయాలని డైరెక్షన్స్ ఇప్పించా. కౌంటర్ ఫైల్ చేస్తే దొంగ దొరికిపోతాడని కేంద్ర ప్రభుత్వం వాయిదాలు తీసుకుంటోంది. అంతేగానీ అనుమతులు ఇచ్చారా లేరా అనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు’ అని రేవంత్ పేర్కొన్నారు.

Latest Updates