వాళ్ళను గాలికొదిలేసి.. కేసీఆర్ కుటుంబంపై ఉన్న కేసులను కొట్టేయించుకున్నారు

ప్ర‌త్యేక‌ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా సీఎం కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేద‌ని ఎంపీ, కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కేవ‌లం త‌న సామాజిక వ‌ర్గానికే న్యాయం చేశార‌ని అన్నారు. 14 ఏళ్లుగా ఉద్య‌మం చేసి తెచ్చుకున్న తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌ర‌గ‌డం లేద‌న్నారు. కేవ‌లం త‌న కుటుంబ స‌భ్యులు, త‌న సామాజిక వ‌ర్గానికే మేలు జ‌రిగే విధంగా కేసీఆర్ వ్య‌వ‌హ‌రించార‌న్నారు.

నీళ్లు-నిధులు-నియామకాలు అనే ఎజెండాతో జ‌రిగిన ఉద్యమంలో నీళ్లు జగన్మోహన్ రెడ్డి తీసుకుపోతే-నియామకాలు పక్కదారి పట్టాయని రేవంత్ విమ‌ర్శించారు. ఉద్యమం కోసం త‌మ ప్రాణాలు అర్పించిన అమ‌ర వీరుల కుటుంబాల‌ను టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఘోరంగా అవ‌మానిస్తుంద‌న్నారు. ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల పై కేసులు ఇంకా తొలగించలేదు కానీ- కేసీఆర్ కుటుంబం పై ఉన్న కేసులను మాత్రం ప్రత్యేక టీమ్ లను పెట్టి కేసులు కొట్టేయించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళు గడుస్తున్నా.. ఉద్యమ కారుల పై కేసులు తొలగించకపోవడాన్ని చూస్తుంటే ఉద్యమ కారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మర్యాద ఇస్తుందో అర్థం అవుతుందన్నారు. విలువలతో కూడుకున్న తెలంగాణ రాష్ట్రం అవుతుంది అనుకుంటే-నిర్బంధ తెలంగాణగా ప్రపంచానికి కనిస్తోందని అన్నారు.

ఉద్యమంలో చెప్పిన నీళ్లు,నిధులు,నియామకాలు–ఎన్నికల్లో చెప్పిన హామీలు ఎక్కడ పోయాయి? అని సీఎం కేసీఆర్ ను ప్ర‌శ్నించారు రేవంత్. “ఉచిత విద్య- దళిత గిరిజన రిజర్వేషన్లు- డబుల్ బెడ్ ఇండ్లు- మూడెకరాల భూమి- నీటి ప్రాజెక్టులు ఎక్కడ పోయాయి? 1లక్ష 20వేల ప్రాజెక్టుల పై నిధులు ఖర్చు చేస్తే- పాలమూరు-ఎస్ ఎల్ బీసీ లాంటి ప్రాజెక్టులు ఎటు పోయాయి?. మిషన్ కాకతీయ నాలుగో విడత‌‌ ఎక్కడికి పోయింది? ఆరేళ్ల లో ఎన్ని చెరువులు మిషన్ కాకతీయ పునరుద్ధరణ చేశారు? . హైదరాబాద్ అభివృద్ధి-నిరుద్యోగ భృతి-రుణమాఫీ ఎందుకు పూర్తి స్థాయిలో అందడం లేదు?” అని ప్ర‌శ్న‌లు సంధించారు.

స్వేచ్ఛ కోసం ఉద్యమం చేసిన రాష్ట్రంలో సామాజిక తెలంగాణ ఎక్క‌డా కనిపించడం లేదన్నారు రేవంత్. కేసీఆర్ కేవ‌లం త‌న కుటుంబీకులు, త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారినే త‌న హ‌యాంలో ప‌దోన్న‌తులు, అధికారాలు క‌ల్పించార‌ని రేవంత్ అన్నారు. గ‌త 20 ఏళ్ల కింద‌ట ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసి రిటైర్ అయిన త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన వారిని తీసుకొచ్చి మ‌ళ్లీ ఇప్పుడు వారిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తున్నార‌న్నారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో మందిని ఆయ‌న నియ‌మించార‌ని, మ‌రో రెండు మూడు రోజుల్లో ఆ లిస్ట్‌ను తాను బ‌య‌ట పెడ‌తాన‌ని అన్నారు.

Latest Updates