18నెలల పాటు కొండను తవ్వి గ్రామానికి నీళ్లు తెచ్చుకున్న వీర వనితలు

అదో కొండప్రాంతం. ఎక్కడో ఓ మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం. గ్రామంలో 200గడపలు. నీటి సౌకర్యం లేదు. నీటికోసం కిలోమీటర్లు కొండల్ని దాటుకుంటూ వెళ్లాలి. ఎన్నికల సమయాల్లో ఓట్లడిగే నాయకుల తప్పా.. ఊరికి సేవ చేసే నేతలే లేరు.

నాయకులు తమవైపు చూడలేదని, ప్రభుత్వం తమగ్రామాన్ని పట్టించుకోలేదని ఆగ్రామస్తులు, గ్రామంలోని మహిళలు ఎప్పుడూ అనుకోలేదు. అందుకే గ్రామానికి నీళ్లందించే బాధ్యతను మహిళలే నెత్తినేసుకున్నారు. కొండల్ని పిండి చేసి గ్రామానికి నీటి సౌకర్యం తీసుకొచ్చారు. 18నెలల అహర్నిశలు కృషి చేసి గ్రామానికి నీరు వచ్చేలా చేశారు.

గ్రామమహిళలు చూపిన తెగువపై సమాచారం అందుకున్న మీడియా..ఆ  గ్రామం గురించి ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రస్తుతం నెటిజన్లు, నాయకులు నీటికోసం ఆ గ్రామానికి చెందిన మహిళలు చేసిన సాహసాలపై ప్రశ్నంసల వర్షం కురిపిస్తున్నారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖజురహో ఆలయాలకు నెలవైన ఛత్తర్ పూర్ జిల్లా మారుమూర గ్రామం అంగ్రోత. దాదాపు రెండొందల కుటుంబాలుండే ఆ ఊరికి నీటి తిప్పలు. ఊరికి పుష్కలంగా నీరు అందాలంటే..అడవిలో పారే నీళ్లను తమ గ్రామానికి మళ్లించుకోవాలి. అలా మళ్లించుకోవాలంటే అరకిలోమీటర్ పొడవున ఓ కొండ ఉంది. ఆ కొండను తవ్వితే నీరందుతుంది.

ఊరికి నీళ్ల బాధను దూరం చేసే బాధ్యతను మహిళలు స్వచ్ఛందంగా భుజానికెత్తుకున్నారు.. జల్ సహేలీ పేరుతో ఓ బృందంగా ఏర్పడిన 250మంది మహిళలు 18నెలల పాటు శ్రమించి అరకిలోమీటర్ కొండను తవ్వారు. అడవిలో పారే నీళ్లు ఊరి చెరువుకు వచ్చేలా చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ తాము కొండను తవ్వుతున్నట్లు అధికారులకు తెలిసినా ఎవరూ స్పందించలేదన్నారు. ప్రభుత్వ సహకారం లేకపోయినా గ్రామస్థుల సహకారంతో కొండను తవ్వి గ్రామానికి నీరొచ్చేలే చేశామని గర్వంగా చెబుతున్నారు.

చివరికి మీడియా ద్వారానే తాము చేసిన కష్టం ప్రపంచానికి తెలిసిందని అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తమగ్రామాన్ని గుర్తించాలని కోరుకుంటున్నారు.

Latest Updates