MPTC మంచి మ‌న‌సు: రేష‌న్ కార్డులేని నిరుపేద‌ల‌కు బియ్యం పంపిణీ

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా: ప్ర‌భుత్వం చేయ‌లేని ప‌ని చేసి, బ‌డా లీడ‌ర్లు సైతం అత‌డిని చూసి నేర్చుకునేలా చేశాడు ఓ యంగ్ లీడ‌ర్. లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం రేష‌న్ కార్డు ఉన్న‌వారికి మాత్ర‌మే బియ్యం, రూ.1500 న‌గ‌దు ఇస్తున్న విష‌యం తెలిసిందే. కానీ.. రేష‌న్ కార్డులేని పేద‌వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారికి కూడా రేష‌న్ బియ్యం, డ‌బ్బులు ఇవ్వాల‌ని ఎంత మంది ప్ర‌తిప‌క్ష నాయ‌కులు డిమాండ్ చేసినా ఫ‌లితం లేకుండా పోయింది. కానీ.. ఓ ఎంపీటీసీ ముందుకువ‌చ్చి రేష‌న్ కార్డులేని నిరుపేద‌ల‌కు బియ్యం పంపిణీ చేశారు.

భువనగిరి మండలంలోని కూనూరు గ్రామంలో మంగ‌ళ‌వారం రేషన్ కార్డు లేని 60 కుటుంబాల‌కు(మ‌నిషికి-12కిలోల చొప్పున‌) బియ్యం పంపిణీ చేశారు కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్. ఇదే విష‌యంపై శివానంద్ మాట్లాడుతూ.. ఈ మంచి ప‌ని చేసేముందు మ‌రికొంత మంది దాత‌ల‌కు పిలుపునివ్వ‌గా ప‌లువురు దాత‌లు కూడా ముందుకు వ‌చ్చార‌ని తెలిపారు. కూనూరు, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేదలకు ధాతల నుండి సేకరించిన 15 క్వింటాళ్ల‌ బియ్యం పంపిణీ చేశామన్నారు.

లాక్ డౌన్ కార‌ణంగా ఇబ్బo‌ది ప‌డుతున్న రేషన్ కార్డు లేని నిరుపేదలకు బియ్యాన్ని అందివ్వాలనే ఉద్దేశ్యంతో 3 రోజుల కింద‌ట‌ పిలుపునిచ్చాన‌ని చెప్పారు. ఈ మేరకు దాదాపు 30 మంది దాత‌లు (రైతులు) కలిసి 15 క్వింటాళ్ల‌ బియ్యం డొనేట్ చేశారని తెలిపారు. మంచి మ‌న‌సుతో దానం చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన దాత‌ల‌కు థాంక్స్ తెలిపిన‌ ఎంపీటీసీ.. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా రేష‌న్ కార్డులేని నిరేపేద‌ల‌ను గుర్తించి.. వారికి బియ్యం, న‌గ‌దు సాయం అందించాల‌ని కోరారు.

Latest Updates