ధోనీ క్రికెట్‌‌ లెజెండ్‌‌ : కోహ్లీ

  • అతని అనుభవం,ఫీడ్‌ బ్యాక్‌ వెలకట్టలేనిది..
  • మహీపై కెప్టెన్ కోహ్లీ ప్రశంసల జల్లు
  • మహీ ఇన్నింగ్స్‌ కు టాప్‌ రేటింగ్‌‌ ఇచ్చిన బుమ్రా

మాంచెస్టర్‌‌: రెండో పవర్‌‌ ప్లేలో ధోనీ స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయలేకపోతున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నా.. టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ మాత్రం మహీకే మద్దతిచ్చాడు. స్లో బ్యాటింగ్‌‌ అనేది పెద్ద విషయం కాదని తేలికగా కొట్టిపారేసిన కోహ్లీ.. ధోనీ క్రికెట్‌‌ లెజెండ్‌‌ అని కొనియాడాడు. ఈ మాజీ సారథి అనుభవం, ఫీడ్‌‌బ్యాక్‌‌ వెలకట్టలేనిదని ప్రశంసలు కురిపించాడు. ‘మిడిల్‌‌లో ఎలా ఆడాలో ధోనీకి బాగా తెలుసు. ఎప్పుడైనా కొద్దిగా బాగా ఆడకపోతే ప్రతి ఒక్కరు అతని గురించే మాట్లాడుతుంటారు. కానీ మేం పట్టించుకోం. మా కోసం ఎన్నో మ్యాచ్‌‌లు గెలిపించాడు. అందుకే మా మద్దతు ఎప్పుడూ అతనికే. చివర్లో 15, 20 రన్స్‌‌ కావాల్సినప్పుడు ధోనీలాంటి ఆటగాడే కావాలి. వాటిని ఎలా సాధించాలో అతనికి మాత్రమే తెలుసు. అతని అనుభవం వల్ల పది సార్లలో ఎనిమిది సార్లు మాకు మంచే జరిగింది. విండీస్‌‌పై 268 స్కోరును సులువుగా కాపాడుకుంటామని ధోనీయే చెప్పాడు. గేమ్‌‌ను అర్థం చేసుకోవడంలో అతన్ని మించినోళ్లు లేరు. ప్రతి క్షణం అతనిచ్చే ఫీడ్‌‌ బ్యాక్‌‌ మాకు అమూల్యమైంది. అందుకే అతను ఓ లెజెండ్‌‌. అతనికి తెలియని విషయమంటూ ఏదీ లేదు’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.

ధోనీది టాప్‌‌ రేటింగ్‌‌ ఇన్నింగ్స్‌‌: బుమ్రా

విండీస్‌‌పై మహీ ఆడిన ఇన్నింగ్స్‌‌కు బుమ్రా టాప్‌‌ రేటింగ్‌‌ ఇచ్చాడు. మిడిలార్డర్‌‌లో అతను కుదురుకోవడానికి కచ్చితంగా సమయం ఇవ్వాల్సిందేనన్నాడు. ‘ఈ మధ్య ధోనీ మరి మెల్లగా ఆడుతున్నాడని అందరూ విమర్శిస్తున్నారు. కానీ అది సరైంది కాదు. స్లోగా ఆడుతున్నాడని అనిపించినా.. అలాంటి ఇన్నింగ్స్‌‌కు కచ్చితంగా సమయం అవసరమే. ఒత్తిడిని జయించి ఇన్నింగ్స్‌‌ను మరింత ముందుకు తీసుకెళ్తున్నాడు. కరీబియన్లపై టాప్‌‌ రేటింగ్‌‌ ఇన్నింగ్స్‌‌ ఆడాడు కాబట్టే.. మేం 268 పరుగులు చేయగలిగాం. ఆ పిచ్‌‌పై అది మంచి స్కోరే. తర్వాత  పించ్‌‌ హిట్టర్లు ఉన్నారనే భావనతో మహీ అంత టైమ్‌‌ తీసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌‌ను చూసి యువకులు ఎంతో నేర్చుకోవచ్చు’ అని బుమ్రా పేర్కొన్నాడు. విండీస్‌‌ మ్యాచ్‌‌లో తన వ్యక్తిగత పెర్ఫామెన్స్‌‌ సంతృప్తినిచ్చిందన్నాడు. మరోవైపు ధోనీ.. తనకున్న అనుభవం, సామర్థ్యంతో తప్పకుండా రాణిస్తాడని గంగూలీ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. అతని స్లో బ్యాటింగ్‌‌ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. ‘గతేడాది ఇంగ్లండ్‌‌ టూర్‌‌కు వచ్చినప్పుడు కూడా ధోనీ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. స్పిన్‌‌ను ఆడటంలో బాగా ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నా తొందరగానే కుదురుకుంటాడు. మూడోస్థానంలో విరాట్‌‌, తర్వాత రాహుల్‌‌, ఐదులో ధోనీ ఆడాలి. అప్పుడు ఈజీగా స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయొచ్చు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

 

Latest Updates