కెప్టెన్సీ చేపట్టినా.. మొహమాటం తగ్గలేదు

 

ధోనీకి సిగ్గెక్కువ అని హర్భజన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: కెరీర్ మొదట్లో మహేంద్ర సింగ్ ధోని చాలా మొహమాటంగా ఉండేవాడని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. మిగిలిన టీమ్ మేట్స్ తో ధోని ఎక్కువగా మాట్లాడటం, కలవడం కానీ చేసేవాడు కాదన్నాడు. అయితే 2008లో సిడ్నీ టెస్ట్ తర్వాత పరిస్థితులు మారిపోయాయన్నాడు. ‘నేను ధోని కలసి చాలా క్రికెట్ ఆడాం. వెస్టిండీస్, శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల్లో మేం టూర్స్ కు వెళ్లాం. ఎప్పుడు కూడా ధోని మా రూమ్స్ కు వచ్చే వాడు కాదు. అతడు తనంతట తానుగా అన్నట్టు ఉండేవాడు. సచిన్, జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, యువరాజ్ సింగ్ ఇలా మేమందరం కలసి ఎంజాయ్ చేసే వాళ్లం. ధోని మాత్రం చాలా కామ్ గా ఉండేవాడు. 2008లో ఆసీస్ తో సిరీస్ లో సిడ్నీ టెస్ట్ తర్వాత అంతా మారిపోయింది. ఆ మ్యాచ్ తో అందరం ఒక్కటయ్యాం. ఆ క్షణాలు ‘మనం అందరం ఒక్కటే’ అని మమ్మల్ని నమ్మేలా చేసింది. అప్పటి నుంచి ధోని అందరితో కలవడం మొదలైంది. మాతో కూర్చునేవాడు. అయినా అప్పడు అతడు యంగ్ స్టర్’ అని ధోని చెప్పాడు.

బౌలర్లకు స్వేచ్ఛ ఇచ్చేవాడు
టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా ధోని నిశ్శబ్దంగా ఉండటాన్ని అలాగే కొనసాగించాడు. సహచరులకు ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చేవాడని భజ్జీ అన్నాడు. ‘ కెప్టెన్సీ చేపట్టాక కూడా అతడి సిగ్గు పోలేదు. సలహాలు ఇవ్వాలనుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చేవాడు. అప్పుడూ ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. ఏ ఫీల్డింగ్ సెట్ చేయాలి, ఏది వద్దు అనే దానిపై ఏమీ చెప్పేవాడు కాదు. ఆ విషయాన్ని బౌలర్లకు వదిలేసే వాడు. మాకు మాత్రమే కాదు దీపక్ చాహర్ లాంటి యంగ్ స్టర్స్ కు కూడా అతడు అంతే స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ విషయాన్ని ధోని నుంచి మిగిలిన వాళ్లు నేర్చుకోవాలి. బౌలర్, బ్యాట్స్ మన్ ఎవరైనా సరే వారికి ఫ్రీడమ్ ఇవ్వడమనేది చాలా ముఖ్యం’ అని టర్బనేటర్ పేర్కొన్నాడు.

ఎల్లో జెర్సీ వేసుకున్నప్పుడు ఏదోలా అనిపించింది
ఐపీఎల్ లో ముంబై జట్టుకు పదేళ్లు ఆడిన తర్వాత చెన్నై టీమ్ కు మారిన టైమ్ లో ఎల్లో జెర్సీ వేసుకున్నప్పుడు ఏదోలా అనిపించిందని భజ్జీ చెప్పుకొచ్చాడు. ‘ఎల్లో జెర్సీ ఫస్ట్ టైమ్ వేసుకున్నప్పుడు నాకు కొంచెం వింతగా అనిపించింది. అరే ఏంటిది, ఇది కలా? నిజమా? అన్నట్లు ఫీల్ అయ్యాను. ముంబై తరఫున సీఎస్ కే తో తలపడినప్పుడు ఇండియా–పాకిస్తాన్ మధ్య పోరులా ఉండేది. అది కఠిన సమయం. అయితే ఒక్కసారిగా నేను బ్లూ జెర్సీ కాకుండా ఎల్లో వేసుకోవాల్సి వచ్చింది’ అని పంజాబ్ పుత్తర్ వివరించాడు.

Latest Updates