బీఎస్ఎన్ఎల్​లో ఎంటీఎన్​ఎల్​ విలీనం

  • బీఎస్​ఎన్​ఎల్​ను మూసేయం
  • రెండేళ్లలో లాభాల బాట
  • అమ్మే ప్రసక్తే లేదు
  • ఉద్యోగుల వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కూ కేబినెట్‌ గ్రీన్‌ సి గ్నల్‌
  • రవిశంకర్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వెల్లడి

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) భవిష్యత్తుపై అనుమానాలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ సంస్థను మూసేయబోమని క్లారిటీ ఇచ్చింది. బీఎస్​ఎన్​ఎల్​లో ఎంటీఎన్ఎల్ విలీనానికి కేంద్ర కేబినెట్​ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థల్లో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోబోమని, కొత్తగా రూ.29,937 కోట్ల రివైవల్ ప్యాకేజీని అందిస్తామని టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అలాగే, గోధుమలు, పప్పుధాన్యాలు, అవాలు, పొద్దుతిరుగుడు, శనగలు, బార్లీ కనీస మద్దతు ధరను 50 శాతం నుంచి 109 శాతానికి పెంచింది. ఇక తొలిసారి నాన్​ ఆయిల్​ కంపెనీలు కూడా పెట్రోల్​ బంకులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఢిల్లీలో సుమారు 1800 అనధికార కాలనీలను రెగ్యులరైజ్​ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో సుమారు 50 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌ సంచార్‌‌‌‌ నిగమ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌), మహానగర్‌‌‌‌ టెలికం నిగమ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (ఎంటీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌)ల విలీనానికి కేంద్ర కేబినెట్‌‌‌‌ బుధవారం ఆమోద ముద్ర వేసింది. కుంటి నడకన నడుస్తున్న ఈ రెండు ప్రభుత్వ రంగ  టెలికం సంస్థలను రివైవ్‌‌‌‌ చేసే దిశలోనే  విలీన ప్రతిపాదనను ఆమోదించారు. మెర్జర్‌‌‌‌కు ముందు బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌కు సబ్సిడరీగా ఎంటీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ ఉంటుందని, రాబోయే రెండేళ్లలో ఈ రెండూ లాభాల బాట పడతాయని ఆశిస్తున్నామని కేంద్ర ఐటి మంత్రి రవిశంకర్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ వెల్లడించారు. ప్రధాన మంత్రి మోడి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌‌‌‌ మీటింగ్‌‌‌‌ ఈ మెర్జర్‌‌‌‌కు ఆమోదం తెలిపిందని ప్రకటించారు.

నాలుగేళ్ల రివైవల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌….

బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌, ఎంటీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌లకు చెందిన రూ. 38 వేల కోట్ల ఆస్తుల అమ్మకం ద్వారా రెండు సంస్థలూ నిధులు సమకూర్చుకునేలాను, రూ. 15 వేల కోట్లను సావరిన్‌‌‌‌ బాండ్స్‌‌‌‌ జారీ ద్వారా సమీకరించేలానూ రివైవల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ రూపొందించినట్లు మంత్రి తెలిపారు.  వచ్చే నాలుగేళ్లలో ఈ ప్లాన్‌‌‌‌ అమలవుతుందన్నారు. ఆ సంస్థలలోని ఉద్యోగుల వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు కూడా కేబినెట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ సిగ్నల్‌‌‌‌ ఇచ్చింది. యాభై మూడున్నర ఏళ్ల లోపు ఉద్యోగులు వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ తీసుకోవాలనుకుంటే వారికి మిగిలిన సర్వీసుకుగాను 125 శాతం పేఅవుట్‌‌‌‌ (జీతం, గ్రాట్యుటీ, పెన్షన్‌‌‌‌) ఈ వీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ కింద లభిస్తుంది. రెండు సంస్థలలోని సగం మంది ఉద్యోగులకు ఈ స్కీము కింద అర్హత ఉంటుందని రవిశంకర్‌‌‌‌ ప్రసాద్‌‌‌‌ తెలిపారు.

అమ్మే ప్రసక్తే లేదు…

మార్చి 2018 నాటికి బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ చేతిలో రూ. 70 వేల కోట్ల విలువైన భూమి, రూ. 3,760 కోట్ల విలువైన బిల్డింగ్స్‌‌‌‌ ఉన్నాయి. రెండు సంస్థలకూ కలిపి అప్పులు రూ. 40 వేల కోట్లు. ఈ సంస్థలు రెండూ వ్యూహాత్మకంగా దేశానికి చాలా ముఖ్యమైనవి, ఇవెంతో ప్రధాన పాత్ర పోషించాయని మంత్రి పేర్కొన్నారు. బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌, ఎంటీఎన్‌‌‌‌ఎల్‌‌‌‌లలో ఏ ఒక్క దానినీ మూసివేయడం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆ సంస్థలలో ప్రభుత్వ వాటాను థర్డ్‌‌‌‌ పార్టీలకు అమ్మే ప్రసక్తి కూడా లేదని వెల్లడించారు.

ఎట్టకేలకు 4 జీ స్పెక్ట్రమ్‌‌‌‌….

బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌, ఎంటీఎన్ఎల్‌‌‌‌లకు దీపావళి సందర్భంగా మరో విలువైన కానుకనూ కేంద్ర కేబినెట్‌‌‌‌ ప్రకటించింది. 2016 రేట్లకే రూ. 4 వేల కోట్ల విలువైన 4 జీ స్పెక్ట్రమ్‌‌‌‌ను ఈ సంస్థలకు  ఇవ్వనున్నారు. బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌కు టవర్‌‌‌‌ అసెట్సూ భారీగా ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ టవర్‌‌‌‌ కార్ప్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (బీటీసీఎల్‌‌‌‌) పేరిట ప్రత్యేక కంపెనీనే 2018 లో ఏర్పాటు చేశారు. ఐతే, ఈ కంపెనీకి టవర్‌‌‌‌ అసెట్స్‌‌‌‌ను మాత్రం బీఎస్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ ఇంకా బదిలీ చేయలేదు.

Latest Updates