ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మొహర్రం…

సిటీలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సమీక్షించారు. గణేష్ నిమజ్జనం, మొహర్రం ఒకే రోజు రావడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తిచేస్తామని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈనెల 12న జరగనున్న గణేష్ నిమజ్జన శోభాయాత్ర పోలీసులకు పెద్ద సవాల్ గా మారింది. నిమజ్జనం, మొహర్రం పండుగలు ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రతి గణేష్ మండపానికి ఒక పోలీసులను కేటాయించారు. అన్ని విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశారు. పాతబస్తీ లాంటి సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

బాలాపూర్ వినాయకుడికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత బాలపూర్ నుంచి కొనసాగే వినాయకుడి శోభయాత్ర మార్గాలను అంజనీ కుమార్ పరిశీలించారు. రూట్ మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఉంటుందన్నారు సీపీ. గణేష్ నిమజ్జనానికి 20వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు…

మొహర్రం పండుగ కూడా ఉండడంతో పాతబస్తీలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయమై ఉత్సవ కమిటీలతో ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు చెప్పారు సీపీ. మసీదులపై కూడా ప్రత్యేక నిఘూ ఉంచనున్నారు పోలీసులు. జిల్లాల నుంచి నగరానికి అదనపు సిబ్బందిని తరలిస్తామన్నారు సీపీ. ఇక నిమజ్జనం కోసం 32 క్రేన్స్ ఏర్పాటు చేశామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. 32 వేల మంది కార్మికులు నిమజ్జనం కార్యక్రమంలో భాగస్వాములవుతారని చెప్పారు.

Latest Updates