రిలయన్స్ అప్పు రూ.4.62 లక్షల కోట్లు

దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముకేశ్‌ అంబానీ కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్‌ ) అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రముఖ ఆర్థికసేవల సంస్థ క్రెడిట్‌స్విస్‌ హెచ్చరించింది. కంపెనీ అప్పులు 65 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.62 లక్షల కోట్లు) చేరినందున రేటింగ్‌ను తగ్గించింది. వీటిలో అప్పులతోపాటు క్రూడ్‌ పేమెంట్లు, కస్టమర్‌ అడ్వాన్సులు, స్ప్రెక్ట్రం చెల్లింపులు ఉన్నాయి. దీంతో రిలయన్స్‌ షేర్లు 3.48 శాతం నష్టపోయాయి. వచ్చే నగదు కంటే కంపెనీ నుంచి వెళ్లే నగదు ఎక్కువగా ఉందని (నెగటివ్‌ క్యాష్‌ఫ్లో) తెలిపింది. 2015లో కంపెనీ అప్పులు 19 బిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాదిలో ఇవి 65 బిలియన్ డాలర్లకు చేరాయి.

ఇదే కాలంలో నికర అప్పు 2.7 బిలియన్ డాలర్ల నుంచి 12.4 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. కన్సాలిడేటెడ్‌ బ్యాలన్స్‌షీట్‌లో అదనపు అప్పు 9.4 బిలియన్‌ డాలర్ల నుంచి 20.6 బిలియన్‌ డాలర్లకు ఎగిసింది. వడ్డీవ్యయం 1.2 బిలియన్ డాలర్ల నుంచి నాలుగు బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఈబీఐటీలో ఇది 44 శాతం నమోదయింది. క్రూడ్‌ ఆయిల్‌ చెల్లింపులకు 121 రోజుల వరకు గడువు ఉంటుందని తెలిపింది. రిలయన్స్​ 25 శాతం క్రూడ్‌ను వెనిజులా, మెక్సికో నుంచి, మూడుశాతం బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ నుంచి కొంటున్నది. కస్టమర్ల అడ్వాన్సుల విలువ 5.9 బిలియన్ డాలర్లు ఉన్నాయని తెలిపింది. విదేశీ కరెన్సీ అప్పులు 2017లో 60 శాతం ఉండగా, ఈ ఏడాది 40 శాతానికి పడిపోయాయి. జియో ఎంటర్‌ప్రైజ్‌ వాల్యుయేషన్‌ 46 బిలియన్ డాలర్లు ఉంటుందని క్రెడిట్‌స్విస్‌ వెల్లడించింది. యూజర్‌ నుంచి వచ్చే సగటు ఆదాయం తక్కువగా ఉందని పేర్కొంది. ప్రత్యర్థి టెలికం కంపెనీల కంటే జియో టారిఫ్‌లు 25 శాతం తక్కువగా ఉండటమే ఇందకు కారణమని తెలిపింది.

Latest Updates