‘క్షమాభిక్ష’ రివ్యూ… మేం చేయలేం

‘క్షమాభిక్ష’ రివ్యూ… మేం చేయలేం

న్యూఢిల్లీ:  తన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ తిరస్కరించడాన్ని సవాల్​ చేస్తూ నిర్భయ కేసులో మరణ శిక్ష పడిన దోషి ముఖేశ్​ కుమార్​ సింగ్​ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టేసింది. క్షమాభిక్ష పిటిషన్​ను పరిగణనలోకి తీసుకున్న వెంటనే రిజెక్ట్​ చేయడం అంటే.. ఆలోచన లేకుండా తీసుకున్న నిర్ణయం అని భావించరాదని స్పష్టం చేసింది. కోర్టులు ఇచ్చిన తీర్పుల కాపీలు, దోషి పాత క్రిమినల్​ హిస్టరీ, అతడి కుటుంబం ఆర్థిక పరిస్థితితో పాటు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే రాష్ట్రపతి మెర్సీ పిటిషన్​ను రిజెక్ట్​ చేశారని పేర్కొంది. ముఖేశ్​ పిటిషన్​పై న్యాయమూర్తి జస్టిస్​ ఆర్​ భానుమతి నేతృత్వంలోని ముగ్గురు జడ్జీల బెంచ్​ బుధవారం విచారణ జరిపింది. జైల్లో ఎదుర్కొన్న ఇబ్బందుల ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వులను రివ్యూ చేయలేమని స్పష్టం చేసింది.  మెర్సీ పిటిషన్​లోని అన్ని అంశాలను రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్​లో ‘మెరిట్’​ లేదని, పిటిషనర్​ చెపుతున్న కారణాలన్నీ రాష్ట్రపతి పరిశీలనకు సంబంధం లేనివని బెంచ్​ 25 పేజీల ఆర్డర్​లో పేర్కొంది.

అన్నీ పరిశీలించిన తర్వాతే..

డీఎన్ఏతో పాటు ఇతర మెడికల్​ రిపోర్ట్స్, మరణ వాంగ్మూలం, కేస్​ డైరీ, కేస్ చార్జ్​షీట్​ తో పాటు అన్ని డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాతే ట్రయల్​కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ముఖేశ్​ పిటిషన్​ను తిరస్కరించాయని బెంచ్​ పేర్కొంది. ఎనిమిది నెలలుగా ముఖేశ్​ జైలులో అనేక రకాలుగా వేధింపులను ఎదుర్కొంటున్నాడని, తోటి ఖైదీలకు దూరంగా వేరే సెల్​లో ఉంచుతున్నారన్న అతని తరఫు లాయర్​ వాదనలను బెంచ్​ పరిగణనలోకి తీసుకోలేదు. డైరెక్టర్​ జనరల్​(ప్రిజన్స్) దాఖలు చేసిన అఫిడవిట్​లో సెక్యూరిటీ కారణాల వల్ల ముఖేశ్​ను ఇనుప ఊచలు ఉన్న సెపరేట్​ రూమ్​లో ఉంచుతున్నామని, అది తోటి ఖైదీలకు దూరంగా ఉంచడం కాదని తెలిపిన వివరాలను కోర్టు ప్రస్తావించింది. ఈ కారణాలతో మెర్సీ పిటిషన్​ను తిరస్కరించడంపై సమీక్షకు ఆదేశించలేమని ప్రకటించింది.

త్వరగా తిరస్కరించారని

తీహార్​ జైలు సూపరింటెండెంట్​ ముకేశ్​ నామినల్​ రోల్, అతని లేటెస్ట్​ మెడికల్​ రిపోర్ట్స్, ట్రయల్​ కోర్టు తీర్పు, శిక్షకు సంబంధించిన వివరాల డాక్యుమెంట్లను మెర్సీ పిటిషన్​తో పాటు పంపించారని పేర్కొంది. ఢిల్లీ రాష్ట్ర హోంశాఖ, ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలు, ఆ సందర్భంగా రూపొందించిన నోట్​ను కూడా రాష్ట్రపతికి పంపించారని తెలిపింది. ఆ నోట్​తో పాటు అన్ని డాక్యుమెంట్లు, ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు పరిశీలించిన తర్వాతే రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​ను తిరస్కరించినట్టు స్పష్టం చేసింది.

మెర్సీ పిటిషన్ వేసిన వినయ్ శర్మ

నిర్భయ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ బుధవారం మెర్సీ పిటిషన్‌ వేశాడు. దీంతో న్యాయపరమైన కారణాల వల్ల ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. నిర్భయ దోషులను ఫిబ్రవరి 1న ఉరి తీయాలని ట్రయల్​ కోర్టు డెత్​ వారెంట్​ జారీ చేసింది. ముఖేశ్​ మెర్సీ పిటిషన్​ను జనవరి 17న రాష్ట్రపతి తిరస్కరించారు. మిగతా ముగ్గురిలో వినయ్​ క్యూరేటివ్​ పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టేసింది. అక్షయ్​ బుధవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్​ పిటిషన్​ దాఖలు చేయగా కోర్టు దాన్ని గురువారం విచారించనుంది.పవన్​  క్యూరేటివ్​ పిటిషన్​ వేయాల్సి ఉంది.