అఖిలేశ్​కు…ములాయం దిశానిర్దేశం

లోక్​సభ ఎన్నికల్లో ఓటమితో కష్టాల్లో కూరుకుపోయిన సమాజ్​వాదీ పార్టీని సుదురాయించే బాధ్యత ములాయం సింగ్​ యాదవ్​ ఎత్తుకున్నారు. అఖిలేశ్​ యాదవ్​ నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పెద్దాయన మళ్లీ యాక్టివ్​ అయ్యారు. ఎస్పీని తిరిగి బలోపేతం చేసేలా, దూరమైపోయిన తమ్ముళ్లను, ఇతర నేతలను సొంతగూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజల్ట్స్ తర్వాత మీడియాకు దూరంగా ఉంటున్న అఖిలేశ్​, టీవీ డిబేట్లకు వెళ్లొద్దని పార్టీ నేతల్ని ఆదేశించారు. కొద్దిరోజుల కిందటే ఓటమిపై విశ్లేషణ మొదలుపెట్టిన ఆయన, గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రతి చిన్నవిషయానికి నేతాజీ సలహాను తీసుకుంటున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. అఖిలేశ్ అంతా తానై వ్యవహరించిన 2019 లోక్​సభ ఎన్నికల్లో ఎస్పీ కేవలం 5 సీట్లలో మాత్రమే గెలవగలిగింది. పార్టీ కంచుకోట మైన్​పురిలో ములాయం 95వేల ఓట్ల మెజార్టీతో గెలవగా, మిగతా చోట్ల ఎస్పీ అభ్యర్థులు సాధారణ మెజార్టీతో గట్టెక్కారు. పార్టీకి మునుపటి క్రేజ్​ రావాలంటే యాదవనేతల్ని దగ్గరకుతీసుకోవాలని ములాయం సూచించారని, ఆ మేరకు బాబాయి శివపాల్​ యాదవ్​తో రాజీకి అఖిలేశ్ అంగీకరించారని, అతిత్వరలోనే శివపాల్​ తిరిగి ఎస్పీలో చేరతారని సమాజ్​వాదీ ముఖ్యనేతలు వెల్లడించారు. శివపాల్​ యాదవ్​ ఎన్నికల ముందు ప్రగతిశీల్​ సమాజ్​వాదీ పార్టీ లోహియా(పీఎస్పీఎల్​) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే.

Latest Updates