మోడీ మళ్లీ ప్రధాని కావాలి : ములాయం ఇంట్రస్టింగ్ కామెంట్స్

న్యూఢిల్లీ: 2014-19 లోక్ సభ చివరి సెషన్స్ లో ఇవాళ ఆఖరి రోజు. రాఫెల్ పై కాగ్ రిపోర్టు, త్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చతో సభలో సీరియస్ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) మాజీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ హౌస్ మొత్తం స్టన్ అయ్యే కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా ప్రతిపక్షాల మహా కూటమికి షాక్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీని పొగుడుతూ మాట్లాడారాయన. మోడీనే మళ్లీ పీఎం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఏ సమయంలో పని ఉందని ఆయనను కలిసినా వెంటనే దాన్ని పూర్తి చేసి పెట్టారని ములాయం అన్నారు.

ప్రతిపక్షాలన్నీ కలిసి మోడీని మళ్లీ అధికారంలోకి రానీకుండా చేయాలని మహా కూటమి కట్టి పోరాడుతున్నాయి. ములాయం సింగ్ కుమారుడు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సమయంలో ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆయన పక్కనే కూర్చుని ఉన్నారు. సోనియా సహా ప్రతిపక్ష నేతలు అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. అధికార పార్టీ నేతలు బల్లలు చరిచి సంతోషం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నమస్కారం చేశారు.

ములాయం కామెంట్స్ పై రియాక్టైన మోడీ… ‘ఇంకా చాలా చేయాల్సి ఉంది. నాపై నమ్మకం ఉంచినందుకు ములాయంకు ధన్యవాదాలు. చాలా సంతోషం’ అన్నారు. 

దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. రాజకీయాల్లో ములాయం కీలకమైనవారనీ.. ఆయన అభిప్రాయానికి విలువ ఇస్తున్నానని చెప్పారు. 

Latest Updates